తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నెలకోల్పుతాం: భట్టి విక్రమార్క
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జనం కోరుకుంటున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఈ మేరకు ప్రజల సంపదను ప్రజలకే పంచేందుకు ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆశిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఫ్యూడల్స్, దేశంలో క్యాపిటలిస్టులు కలిసి తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలే కాంగ్రెస్ పార్టీ అజెండా అని భట్టి అన్నారు. ఈ క్రమంలోనే ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పుతామన్నారు. తమ ప్రభుత్వాలు ఏం చేశాయో ప్రజలకు తెలుసన్న భట్టి, 9 ఏళ్లలో ఏదో అద్భుతాలు జరిగినట్లు కేసీఆర్ అభూత కల్పనలు సృష్టించారని మండిపడ్డారు. సంపద, వనరులు, స్వేచ్ఛ కేవలం పాలకులకే పరిమితమయ్యాయన్న భట్టి, తెలంగాణ వనరులను ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని ఆరోపించారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతిలోనే పోలీస్ వ్యవస్థ
రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ఎదురు చూస్తున్నట్లు భట్టి అభిప్రాయపడ్డారు. మరోవైపు సింగరేణిని బొందపెడుతున్న బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలని విద్యార్థులు భావిస్తున్నారన్నారు. ధరణితో తమకు భూములు దక్కకుండా చేస్తున్నారని, అన్నదాతులు ఆవేదన చెందుతున్నట్లు భట్టి వివరించారు. కేసీఆర్ పాలనలో నీటిపారుదల రంగం పూర్తిగా విఫలమైందన్నారు. ఏ వర్గం కూడా కేసీఆర్ పాలనలో సంతోషంగా లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతిలోకి జారిపోయిందన్నారు. 20 మిలియన్ చదరపు అడుగులతో రియల్టర్ ఒక పక్కన , కట్టుకునేందుకు 20 గజాల స్థలం కూడా లేని వాళ్లు మరోపక్కన ఉన్నారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.