తెలంగాణలో వచ్చే 5రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జోరు అందుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ భారీ వర్షాలను కురిపించనున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్,మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. మరోవైపు పలు చోట్ల ఆదివారం, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం నుంచి బుధవారం వరకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వివరించింది.
తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ : డైరెక్టర్ నాగరత్న
కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం, గురువారం భారీ వర్షాలు కురవనున్నట్లు ప్రకటించింది. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా రైతులు పొలాల వద్ద చెట్ల కింద ఉండకూడదని స్పష్టం చేసింది. బంగాళాఖాతం వాయవ్య దిశలో ఈ నెల 16న గాలులతో ఉపరితల ఆవర్తనం చెందేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న స్పష్టం చేశారు.