Telangana CM Oath Ceremony : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. ఇదే బాటలో 11 మంత్రులు
తెలంగాణ కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. 1.21 గంటల నుంచి 1.50 గంటల వరకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. తొలుత మంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయగా, చివరిగా జూపల్లి కృష్ణారావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల దస్త్రంపై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మొదటి సంతకం చేశారు. ఇదే సమయంలో దివ్యంగురాలు రజనికి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం చేశారు.
ఎప్పుడు కావాలంటే అప్పుడు రావొచ్చు : రేవంత్ రెడ్డి
ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు, త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షను నెరవేరుస్తామని, తెలంగాణాలో మరోసారి ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలను బద్దలకొట్టామని, ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రగతి భవన్'కి రావచ్చన్నారు. ఏకైక ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఆయా మంత్రులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai Soundarajan) శాఖలను కేటాయించనున్నారు.