Telangana: తెలంగాణలో కొత్త ప్రాజెక్టు.. పైలెట్ ప్రాజెక్టుగా కొండారెడ్డి పల్లె
రాబోయే రోజుల్లో తెలంగాణను ఒక బిజినెస్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలసి సీఎం తన నివాసంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, రెండు డిస్కంల సీఎండీలు ముషారఫ్, వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌ను తీరుస్తూ ఉత్పత్తిని పెంచేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగాన్ని విస్తృతం చేయాలని ఆదేశించారు.
కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు
ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న ఖాళీ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పాలని సూచించారు. అంతేకాక,రైతులకు ఉచితంగా సోలార్ పంప్ సెట్లు అందించాలనే ప్రణాళిక రూపొందించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ విషయాన్ని పరిశీలనలో భాగంగా, ఆయన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. దీని ద్వారా భవిష్యత్తులో రైతులకు విద్యుత్ సమస్యలు ఎదురుకాకుండా చూడవచ్చని సీఎం అన్నారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని విస్తృతం చేయడంలో భాగంగా వంటగ్యాస్ స్థానంలో సోలార్ విద్యుత్ వినియోగం తీసుకురావాలని, మహిళా సంఘాలకు ఈ అంశంపై శిక్షణ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు.
డిస్కంల రాయితీ రూ.958 కోట్లు విడుదలకు ఉత్తర్వులు జారీ
అటవీ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం చర్యలు తీసుకోవాలని, ప్రతి సంవత్సరం 40 వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాలోని అంతరాయాలను అధిగమించి, ఓవర్ లోడ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక డిస్కంల 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం, వ్యయం, లోటుపై సీఎండీలు సీఎం రేవంత్‌కు వివరాలు అందజేశారు. అదనంగా, గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు, రైతుల వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ అందజేస్తున్న తరుణంలో డిస్కంలకు రాయితీ కింద ఈ నెలకు సంబంధించిన రూ.958 కోట్లను విడుదల చేయాలని తెలంగాణ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.