Loading...
Telangana: తెలంగాణలో కొత్తగా 4.89 లక్షల మందికి పింఛన్లు.. ఖాతాల్లోకి నగదు జమ
తెలంగాణలో కొత్తగా 4.89 లక్షల మందికి పింఛన్లు.. ఖాతాల్లోకి నగదు జమ

Telangana: తెలంగాణలో కొత్తగా 4.89 లక్షల మందికి పింఛన్లు.. ఖాతాల్లోకి నగదు జమ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2026
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కొత్తగా పింఛన్లకు అర్హత సాధించిన లక్షలాది మందికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎంపిక చేసిన 4,89,233 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి పింఛను సొమ్మును నేరుగా బదిలీ చేసింది. గురువారం అచ్చంపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొంతమంది లబ్ధిదారులకు ఆయన స్వయంగా పింఛను మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం సంబంధిత అధికారులు రాష్ట్రంలోని మిగతా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేశారు.

వివరాలు 

నవంబరు నెలకు సంబంధించిన పింఛను జమ

కొత్తగా ఎంపికైన వారందరికీ ప్రభుత్వం నవంబరు నెల పింఛను మొత్తాన్ని చెల్లించింది.

డిసెంబరు నుంచి వీరికి కూడా ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారితో సమానంగా ప్రతినెలా సాధారణ విధానంలో నగదు అందనుంది.

తాజాగా పింఛన్లు మంజూరైన వారిలో 70 శాతానికి పైగా వితంతువులు, ఒంటరి మహిళలు ఉండటం విశేషం.

వీరిలో 2,89,713 మంది వితంతువులు కాగా, 53,841 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. అలాగే 1,00,273 మంది దివ్యాంగులకు కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి.

వివరాలు 

వివిధ వర్గాలకు చెందిన వారికీ లబ్ధి

ఇతర వృత్తులు, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురికీ ప్రభుత్వం పింఛన్లు అందించింది.

ఇందులో 27,437 మంది కల్లుగీత కార్మికులు, 4,450 మంది చేనేత కార్మికులు ఉన్నారు.

వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో 6,375 మంది ఫైలేరియా బాధితులు, 2,938 మంది ఎయిడ్స్ బాధితులు, 1,970 మంది డయాలసిస్ రోగులకు పింఛన్లు మంజూరయ్యాయి.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇతర కేటగిరీలకు చెందిన 2,236 మందికి కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం కలిగింది.

ADVERTISEMENT

వివరాలు 

ఇన్‌స్టంట్ పింఛన్లు 1.23 లక్షల మందికి

ఇదిలా ఉండగా, పింఛను పొందుతున్న భార్యాభర్తల్లో ఒకరు మరణించిన సందర్భంలో జీవించి ఉన్న మరో భాగస్వామికి ఎలాంటి ఆలస్యం లేకుండా పింఛను అందించే ఇన్‌స్టంట్ పింఛను విధానాన్ని కూడా ప్రభుత్వం అమలు చేసింది.

ఈ విధానం కింద ఇప్పటివరకు 1,23,625 మందికి ప్రయోజనం కల్పించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా పింఛన్లు అందుకున్న వారి సంఖ్య మొత్తం 6,12,858కు చేరినట్లు సెర్ప్ అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT