
Telangana: 91.52 లక్షల ఎకరాల్లోపంటల సాగు.. మొత్తం విస్తీర్ణంలో 69 శాతం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో వానాకాలం పంటల సాగు ఈ సీజన్‌లో 69శాతం వరకు పూర్తయింది. మొత్తం 1.32 కోట్ల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 91.52 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ గురువారం సమర్పించిన నివేదికలో పేర్కొంది. వరి పంట సాధారణ సాగు లక్ష్యం 62.47 లక్షల ఎకరాలు కాగా,ఇప్పటివరకు 30.15 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి, ఇది 48 శాతం సాధనగా ఉంది. పత్తి పంట లక్ష్యం 48.93లక్షల ఎకరాలు ఉండగా,43.70లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు,ఇది 89 శాతం సాధన. మొక్కజొన్నకు నిర్ణయించిన 5.21 లక్షల ఎకరాల లక్ష్యాన్ని మించి, 5.52 లక్షల ఎకరాల్లో (106%) సాగు చేపట్టారు.
వివరాలు
ఈ జిల్లాల్లో 50శాతం పైగా పంటలు
సోయాబీన్ పంటకు 4.20 లక్షల ఎకరాల లక్ష్యంతో 3.55 లక్షల ఎకరాల్లో (84%)సాగు జరిగింది. కందుల పంట లక్ష్యం 6.69 లక్షల ఎకరాలు కాగా, 4.43 లక్షల ఎకరాల్లో (66%)పంటలు వేశారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే..సూర్యాపేట,వనపర్తి,మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే పంటల సాగు 50శాతం కంటే తక్కువ విస్తీర్ణంలో సాగింది. మిగిలిన అన్ని జిల్లాల్లో 50శాతం పైగా పంటలు వేశారు. మంచిర్యాల,నిర్మల్,నిజామాబాద్,పెద్దపల్లి,జగిత్యాల,భూపాలపల్లి,జనగామ జిల్లాల్లో వర్షపాతం లోటు నమోదవగా,ఇతర జిల్లాల్లో సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున,వచ్చే రెండు రోజుల్లో ఈ లోటు భర్తీ అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అలాగే,వచ్చే వారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని నివేదికలో స్పష్టంగా పేర్కొంది.