Telangana: హైదరాబాద్'కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము .. ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష
శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ను సందర్శించనున్నారు. డిసెంబరు 17 నుంచి 21 వరకు ఆమె హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రాష్ట్రపతి పర్యటన కోసం తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఆమె ఆదేశించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురకాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక బృందాలు నియమించి నిరంతరం అందుబాటులో ఉంచాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఆమె సూచించారు.
ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత శాఖలకు సీఎస్ ఆదేశం
అదేవిధంగా, బందోబస్తు, ట్రాఫిక్, అగ్నిమాపక సేవలు, నిరంతర విద్యుత్ సరఫరా, రోడ్ల మరమ్మతులు, పరిసరాల పారిశుద్ధ్య నిర్వహణ వంటి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత శాఖలను సీఎస్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్, ఆర్అండ్ బీ ప్రత్యేక సీఎస్ వికాస్ రాజ్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, సమాచార శాఖ ప్రత్యేక సీఎస్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.