LOADING...
Teachers: ప్రభుత్వ టీచర్లకు రేవంత్ సర్కార్ కొత్త నిబంధనలు.. నెలరోజులు గైర్హాజరైతే... ఉద్యోగం ఊస్ట్..!
నెలరోజులు గైర్హాజరైతే... ఉద్యోగం ఊస్ట్..!

Teachers: ప్రభుత్వ టీచర్లకు రేవంత్ సర్కార్ కొత్త నిబంధనలు.. నెలరోజులు గైర్హాజరైతే... ఉద్యోగం ఊస్ట్..!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వపాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు పని వేళలను పాటించకపోవడం,అనుమతి లేకుండా సెలవులు పెట్టడం వంటి అలవాట్లు ఇకపై కొనసాగనివ్వబోమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ముందస్తుసమాచారం లేకుండా,అధికారికంగా సెలవుపత్రం సమర్పించకుండా వరుసగా నెల రోజులపాటు విధులకు గైర్హాజరైతే ఆయా ఉపాధ్యాయులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించే చర్యలు తీసుకుంటామని శాఖ నిర్ణయించింది. ఈఅంశంపై పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారులతో ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించి ముఖగుర్తింపు హాజరు విధానం(ఎఫ్‌ఆర్‌ఎస్‌), మధ్యాహ్న భోజన పథకాల అమలు తదితర అంశాలను సమీక్షించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా నమోదవుతున్న హాజరు వివరాలు,అనధికారిక గైర్హాజరు శాతం వంటి అంశాలన్నీ ఇప్పటికే డీఈఓలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని,వాటిని తరచూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

వివరాలు 

నెల రోజుల గడువు తర్వాత చర్యలు తీసుకునే విధానాన్ని అమల్లోకి..

ఒక నెలపాటు అనుమతి లేకుండా విధులకు రాకుంటే సంబంధిత ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసు జారీ చేసి విచారణ పూర్తి చేసి, ఉద్యోగం నుంచి తొలగింపు ఉత్తర్వులు జారీ చేసి గెజిట్‌లో ప్రచురించాలని డీఈఓలకు సూచనలు చేశారు. సాధారణంగా ఒక్క రోజు కూడా అనధికారికంగా ఉద్యోగానికి రాకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, కొందరు అనారోగ్యం లేదా రోడ్డు ప్రమాదం వంటి కారణాలు చెప్పి కోర్టుల్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉందని, అందుకే నెల రోజుల గడువు తర్వాత చర్యలు తీసుకునే విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని అధికారులు వెల్లడించారు. గత ఆగస్టు నుంచి అమలులో ఉన్న ముఖ గుర్తింపు హాజరు విధానంతో ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే, వెళ్లే సమయాలన్నీ నమోదు అవుతున్నాయి.

వివరాలు 

విధులకు ఆలస్యంగా హాజరవుతున్న వారిపైనా కఠినంగా వ్యవహరిస్తాం 

అయితే ఇప్పటివరకు కేవలం హాజరు అంశానికే ప్రాధాన్యం ఇస్తూ, ఆలస్యంగా రావడంపై పెద్దగా దృష్టి పెట్టలేదని అధికారులు చెబుతున్నారు. ఇకపై విధులకు ఆలస్యంగా హాజరవుతున్న వారిపైనా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. 'హాజరు విధానం అమలులోకి రావడంతో హెచ్‌ఎంలపై ఒత్తిడి తగ్గింది. గతంలో కొందరు ఆలస్యంగా వస్తానని లేదా ముందే వెళ్లిపోతానని అనుమతి కోరేవారు. ఇప్పుడు ఆయా వివరాలన్నీ నమోదవుతాయన్న కారణంతో అలాంటి అభ్యర్థనలు తగ్గిపోయాయి' అని ఒక గెజిటెడ్‌ హెచ్‌ఎం తెలిపారు.

Advertisement

వివరాలు 

గత రెండేళ్లలో సుమారు 50 మందిని ఉద్యోగాల నుంచి తొలగింపు 

ప్రతి సంవత్సరమూ కొందరు ఉపాధ్యాయులు దీర్ఘకాలిక సెలవులు తీసుకొని విదేశాల్లో నివసిస్తున్న తమ పిల్లలు లేదా జీవిత భాగస్వాముల వద్దకు వెళ్తుండటం పరిపాటిగా మారిందని అధికారులు పేర్కొన్నారు. ఆరు నెలల అనుమతి తీసుకొని వెళ్లి ఏడాది, రెండేళ్ల వరకూ విధులకు హాజరు కానివారూ ఉన్నారని సమాచారం. అలాంటి కేసుల్లో గత రెండేళ్లలో సుమారు 50 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. కొందరు సెలవులు పొడిగించుకున్న విషయాన్ని కూడా అధికారికంగా తెలియజేయకుండా గైర్హాజరు అవుతున్నారని చెప్పారు.

Advertisement

వివరాలు 

దీర్ఘకాలంగా విధులకు రాని ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ

దీర్ఘకాలంగా విధులకు రాని ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి ఉద్యోగాల నుంచి తొలగించే ప్రక్రియను మరింత కఠినంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1.15 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, వారిలో సుమారు 6,100 మంది ఇతర పాఠశాలలు లేదా విద్యాశాఖకు చెందిన వివిధ విభాగాల్లో డిప్యుటేషన్‌పై సేవలందిస్తున్నారు.

Advertisement