Voter : ఓటరు చైతన్యం అంటే ఇదే..ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్'కు వచ్చిన పెద్దాయిన
తెలంగాణలో పోలింగ్ సగం సమయం పూర్తైంది. మధ్యాహ్నం దాటినా ఆశించిన మేర పోలింగ్ శాతం నమోదు కాలేదని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ మందకోడిగా సాగుతోందని సమాచారం. ఈ క్రమంలోనే ఓటింగ్ శాతం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం సెలవులు కూడా మంజూరు చేసింది. అయినప్పటికీ కొందరు మాత్రం ఓటు వేయకుండా సెలవును ఇతరత్రా పనులకు వినియోగించి ఐదేళ్ల భవిష్యత్'ను నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. ఇలాంటి అలక్ష్యంతో ఉన్న యువతకు, ఓటర్లకు ఈ సీనియర్ సిటిజన్ కనువిప్పు కలిగిస్తున్నారు. ఓటర్ బాధ్యతను నొక్కి మరీ చెబుతున్నారు. యువ ఓటర్ల బాధ్యతను గుర్తు చేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు కొంత మంది అనారోగ్యంతో ఉన్నా పోలింగ్ కేంద్రాలకు రావడం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ఓట్ వేసిన 75 ఏళ్ల శేషయ్య
హైదరాబాద్ మహానగరం పరిధిలో లివర్ సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్న ఓ పెద్దాయన ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ వచ్చారు. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ స్ప్రింగ్స్‌లో నివాసం ఉండే 75 ఏళ్ల శేషయ్య, స్థానిక GPRA క్వార్టర్స్ పోలింగ్ బూత్'లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓవైపు అనారోగ్యంతో బాధుపడుతున్నా, ఓటు వేయడం బాధ్యతగా భావించారు. అందుకే పౌరుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు కుటుంబంతో కలిసి ఓటింగ్'లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ సిలిండర్, మాస్కుతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. 1966 నుంచి ఏ ఎన్నికల్లోనూ మిస్ కాకుండా ఓటు వేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు లక్షలాది యువ ఓటర్లకు శేషయ్య ఆదర్శంగా నిలుస్తున్నారు.