Telangana Elections : నాగార్జున సాగర్ గొడవపై ఈసీ కీలక ఆదేశాలు.. ఎవరూ మాట్లాడొద్దన్న వికాస్ రాజ్
తెలంగాణలో పోలింగ్ పరిస్థితిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఉదయం పది గంటల సమయంలో ఎన్నికల తెలంగాణ కమిషనర్ వికాస్ రాజ్ కుటుంబంతో కలిసి ఓటు వేసేందుకు ఎస్ఆర్ నగర్ పోలింగ్ బూత్'కు వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్ ల వద్ద జనం క్యూలో నిల్చున్నారని వెల్లడించారు. గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ భారీగా నమోదవుతోందని చెప్పుకొచ్చారు. మరోవైపు నాగార్జున సాగర్ గొడవపై అభ్యర్థులకు, రాజకీయనేతలకు కీలక ఆదేశాలిచ్చారు. ఈ గొడవ విషయం పోలీసులు చూసుకుంటారని, ఇతరులు ఎవరూ కలగజేసుకోవదన్నారు.
డ్యామ్ వద్ద ఉద్రిక్తత.. ఏపీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులు
ఈ విషయంపై ఏ పార్టీకి చెందిన నేతలైనా సరే ఏమీ మాట్లాడకూడదని హెచ్చరించారు. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్ పైకి చేరుకుని 13వ నెంబర్ గేట్ వద్ద ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. అక్కడి వరకు తమ పరిధిలోకి వస్తుందంటూ డ్యామ్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారు. అక్కడున్న సీసీ కెమెరాలతో పాటు ప్రాజెక్టు సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఘటనా స్థలానికి చేరుకుని ఏపీ పోలీసులతో చర్చించారు, ముళ్ల కంచెను తొలగించాలని కోరినా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ససేమిరా వినిపించుకోలేదు.దీంతో టీఎస్ పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది.