
Monsoon: ఆగస్టు ప్రవేశించినా తగినంత కురవని వర్షాలు.. అన్ని జిల్లాల్లో వేడి వాతావరణం
ఈ వార్తాకథనం ఏంటి
వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా తగినంత నీరు తీసుకోకపోతే తీవ్ర అలసట, వాంతులు, విరేచనాలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలం నడుమే రాష్ట్రంలో వేడి తీవ్రత సాధారణ స్థాయిని మించిపోయింది. సాధారణ ఉష్ణోగ్రతలకంటే మూడడిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర దిశగా మేఘాలు మళ్లిపోవడమే దీనికి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పగలు రాత్రి తేడా లేకుండా ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు మొదలై నాలుగు రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో ఒక్క చుక్క వాన పడలేదు.
వివరాలు
వర్షాభావానికి ప్రధాన కారణాలేంటంటే..?
నిపుణుల అంచనాల ప్రకారం, వర్షాలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం నైరుతి గాలుల తేమ క్షీణత. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ కంటే ముందే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇవి దక్షిణ భారత్ నుంచి ఉత్తర భారతదేశం వైపు వెళ్ళాక, ఈశాన్య బంగాళాఖాతంలో ఎక్కువగా అల్పపీడనాలు ఏర్పడ్డాయి. దీంతో వర్షాలు ప్రధానంగా ఉత్తర భారతదేశానికే పరిమితమయ్యాయి. తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో వర్షాలు కురవాలంటే మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడాలి. కానీ అలాంటి పరిస్థితులు తక్కువగా ఉండటంతో వర్షపాతం లోటు నమోదవుతోంది.
వివరాలు
వర్షపాతం గణాంకాలు ఇలా ఉన్నాయి..
రాష్ట్రవ్యాప్తంగా జూన్ నెలలో సాధారణంగా 131.4 మిల్లీమీటర్ల వర్షం పడాలి. కానీ ఈసారి 25 శాతం తక్కువగా, కేవలం 99 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. జులై నెలలో మాత్రం సాధారణ 218.5 మి.మీ.కు మారుగా 229.7 మి.మీ. వర్షం కురిచి 5 శాతం అధికంగా నమోదైంది. మొత్తంగా గత రెండు నెలల్లో రాష్ట్రంలో సగటు 4 శాతం వర్షాభావం నమోదైంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ లోటు మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
వివరాలు
రెండు రోజుల తర్వాత మళ్ళీ వర్షాలు
ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రమైన పొడిగాలులు వీస్తుండటంతో, వర్షానికి అనుకూలంగా మేఘాలు ఏర్పడినా అవి మళ్లీ ఇతర ప్రాంతాల వైపు వెళ్లిపోతున్నాయి. మబ్బులు కనిపిస్తున్నా సరైన వర్షం కురవడం లేదు. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కారణంగా గాలుల దిక్ప్రవాహం కూడా రాష్ట్రం నుంచి ఉత్తరాదికి మళ్లిపోతోంది. అయినప్పటికీ, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో రెండు రోజుల తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశముంది. అప్పటినుంచి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారి ధర్మరాజు తెలిపారు.