Page Loader
ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఈటలకు వై కేటగిరీ భద్రత

ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 28, 2023
07:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పిస్తూ సంచలన ప్రకటన చేసింది. ఈటల రాజేందర్ సతీమణి జమన మంగళవారం చేసిన కీలక వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాజేందర్ హత్యకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ సానుకూల చర్యలు చేపట్టింది. ఈ మేరకు అదనపు భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈటల హత్యకు కుట్రల ఆరోపణల నేపథ్యంలో మంత్రి కేటీఆర్, డీజీపీ అంజనీకుమార్‌కు ఫోన్‌ చేశారు. అనంతరం ఆయన భద్రతపై సీనియర్‌ ఐపీఎస్‌తో విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు భద్రత కల్పించాలని ఆదేశించారు.

DETAILS

ఎవరికీ దక్కని ఆమోదం ఒక్క ఈటలకు మాత్రమే దక్కింది

డీజీపీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు డీసీపీ సందీప్‌ రావు ఈటల నివాసానికి వెళ్లారు. అక్కడ పరిసరాల ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రాజేందర్‌ కుటుంబీకులతో భద్రతపై సమీక్షించారు. గతంలోనూ పలువురు పార్టీ ప్రెసిడెంట్లపై దాడులు జరిగాయి. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌లు ఇలాంటి ఘటనలను ఎదుర్కొన్నారు.ఇక బీజేపీ రాజాసింగ్‌ విషయంలో అనేక బెదిరింపులు వచ్చాయి. అడిషనల్ సెక్యూరిటీ కోసం రేవంత్‌, బండి సంజయ్‌, రాజాసింగ్‌, పవన్‌ కల్యాణ్ కోరుకుంటూ దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే వీరందరిని పక్కన పెట్టి ఒక్క ఈటలకు మాత్రమే అదనపు భద్రత కల్పించడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.రాష్ట్ర ప్రభుత్వ అదనపు భద్రతను ఈటల స్వీకరిస్తారా లేక కేంద్ర భద్రత వైపే మొగ్గుచూపుతారా అనేది తెలియాల్సి ఉంది.