Telangana: తెలంగాణ రైతుల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రైతుబీమాకు యాప్
తెలంగాణ రాష్ట్రంలో రైతుల సాయం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ రైతు బీమా పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను రూపొందించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సాంకేతిక సమస్యలను అధిగమించి పథకాన్ని సజావుగా నిర్వహించడానికి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. అతి త్వరలో యాప్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యాప్ ద్వారా రైతులు, నామినీల వివరాలు నమోదు చేసుకోవడం, మరణ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయడం సులభం అవుతుంది. దీంతో, బీమా సాయం చెల్లింపులు తక్షణం జరుగుతాయని అధికారులు తెలిపారు.
రైతు మరణించినప్పుడు,వారి కుటుంబానికి రూ.5 లక్షల సాయం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు బీమా పథకాన్ని అందిస్తోంది.ఇది 18నుంచి 60ఏళ్ల వయసులో ఉన్న రైతుల కోసం వర్తిస్తుంది. రైతు మరణించినప్పుడు,వారి కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందుతుంది. ఈ పథకానికి సంబంధించిన ప్రీమియాన్ని పది సంవత్సరాలుగా ప్రభుత్వం జీవన బీమా సంస్థకు చెల్లిస్తోంది. నిజానికి, ఈ బీమా పథకాన్ని అమలులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కొన్ని రైతులకు సాయం అందకపోవడం,ఆధార్‌లో తప్పులు,నామినీ పేర్ల పొరపాట్లు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. మరణ ధ్రువీకరణ పత్రాలు ఆలస్యంగా అందడంతో కూడా రైతు కుటుంబాలకు సాయం అందడం కష్టంగా మారింది. కొత్తగా బీమా కోసం నమోదు చేసుకునేందుకు కూడా రైతులకు సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకే,రైతు బీమా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు కొత్త యాప్‌ను రూపొందించేందుకు సన్నద్ధమవుతున్నారు.