Power Purchase: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం.. హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) మరోసారి కష్టాల్లో పడ్డాయి. గురువారం నుంచి తెలంగాణ డిస్కంలు విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయడానికి అనుమతిని నిలిపివేశాయి. పవర్ ఎక్స్ఛేంజీలు ఈ నిర్ణయాన్ని తీసుకోగా, ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తుకు సంబంధించిన రూ. 261 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన కారణంగా ఈ చర్య జరిగింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు బకాయిల గురించి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (NLDC)కు ఫిర్యాదు చేయడంతో, NLDC తెలంగాణ డిస్కంలను విద్యుత్ బిడ్లలో పాల్గొనకుండా అడ్డుకుంది. ఈ పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను ఆశ్రయించిన తెలంగాణ డిస్కంలు
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల ఫలితంగా విద్యుత్ కొనుగోలులో ఆటంకాలు ఎదురయ్యాయని అధికార వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్తు అందుకునేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌తో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా 1000 మెగావాట్లకు అదనంగా మరొక 1000మెగావాట్ల విద్యుత్తు సరఫరా కోసం కారిడార్‌ను బుక్ చేసింది. అయితే, ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్తు అందించలేకపోవడంతో ఈ కారిడార్‌ను రద్దు చేసింది.దీని ఫలితంగా, విద్యుత్ వాడినా వాడకపోయినా పరిహారంగా రూ.261 కోట్లు చెల్లించాలని తెలంగాణ డిస్కంలకు పీజీసీఐఎల్ నోటీసులు పంపించింది. ఈ వివాదం నేపథ్యంలో,తెలంగాణ డిస్కంలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను ఆశ్రయించాయి. వివాదం సీఈఆర్సీ పరిధిలో ఉన్నప్పటికీ, తాజాగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించనుంది.