శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ.. రేపు అమరవీరుల స్తూపం ఆవిష్కరణకు ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది.
తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన అమరుడు శ్రీకాంతాచారిని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసుకుంటోంది.
ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమెకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
గతంలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసిన శంకరమ్మ ఓటమి పాలయ్యారు. అనంతరం ఉపఎన్నికలో టిక్కెట్ బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించినా దక్కలేదు.
DETAILS
అనూహ్యంగా శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇవ్వనుండటం పట్ల రాజకీయాల్లో సంచలనం
ఈ క్రమంలోనే ఆమెకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి, సైదిరెడ్డిని అసెంబ్లీ బరిలో నిలిపారు. అప్పట్నుంచి ఎమ్మెల్సీ పదవి కోసం శంకరమ్మ ఎదురు చూస్తున్నట్లు వినికిడి.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజును ఇప్పటికే అమరవీరుల స్మరణకు ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అమరుల స్మారక కేంద్రాన్ని సీఎం కేసీఆర్ రేపు సాయంత్రం ఆవిష్కరించనున్నారు.
ఈ సభలోనే శంకరమ్మను ఎమ్మెల్సీగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
రాష్ట్రం వచ్చి పదేళ్లైనా అమరులకు బీఆర్ఎస్ చేసిందేం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పదవి ఇస్తే సరిపోతుందనే భావన ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ లో ఉన్నట్లు సమాచారం.
ఎప్పట్నుంచో సీనియర్లు ఎమ్మెల్సీ కోసం ఎదురుచూస్తుండగా, అనూహ్యంగా శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇవ్వనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.