Kalyana Lakshmi Scheme: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రజలందరూ ఎదురుచూస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఈ పథకాలపై ప్రశ్నించగా, మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు. దీంతో ఈ పథకాల అమలుపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి.
ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, రూ.500 గ్యాస్ సిలిండర్, రుణమాఫీ, రైతుబంధు వంటి పథకాలను అమలు చేసింది.
అంతేకాకుండా మహిళా దినోత్సవం సందర్భంగా స్వయం సహాయక సంఘాల ద్వారా పెట్రోల్ బంక్‌లు, ఆర్టీసీ బస్సుల యజమానులుగా మారే అవకాశాలను కల్పించింది.
Details
'కళ్యాణమస్తు'గా మారుస్తాం
గత ప్రభుత్వం తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించడంతో పాటు, దాన్ని 'కళ్యాణమస్తు'గా మారుస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి బకాయిలను పూర్తిగా చెల్లించామని మంత్రి ప్రకటించారు.
నిధుల కొరత లేకుండా పథకాన్ని కొనసాగిస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో పెండింగ్ బిల్లుల సమస్య ఉందని, ఇప్పుడైతే ఆ సమస్య లేకుండా తక్షణ చెల్లింపులు జరుగుతున్నాయని మంత్రి పొన్నం వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ తమ పాలనలో కళ్యాణ లక్ష్మి బకాయిలు ఎందుకు పెండింగ్‌లో ఉంచిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
Details
తెలంగాణలో కళ్యాణ లక్ష్మి పథకం కొనసాగింపు
మంత్రి పొన్నం ప్రకటనతో తెలంగాణ ప్రజల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై ఉన్న అనిశ్చితి తొలగిపోయింది.
ప్రభుత్వం ఈ పథకాలను బరాబర్ కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ వివాహ నిధులు వెంటనే అందజేస్తామని, ఇకపై ఈ పథకంలో ఏ సమస్యలు ఉండవని మంత్రి పేర్కొన్నారు.