Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 2008 డీఎస్సీ బాధితులకు కాంట్రాక్ట్ ఎస్జీటీ ఉద్యోగాలు!
16 సంవత్సరాల క్రితం ఉద్యోగ నియామక పరీక్షల్లో నష్టపోయిన వారికి న్యాయం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ద్వారా నష్టపోయిన అభ్యర్థులను కాంట్రాక్ట్ విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించేందుకు ప్రభుత్వం మంగళవారం సిద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయం ద్వారా సుమారు 2,367 మంది అభ్యర్థులు లబ్ధి పొందనున్నట్లు తెలిసింది. ప్రధానంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అధిక సంఖ్యలో పోస్టులు ఉండనున్నాయి. 2008 డీఎస్సీ సమయంలో 30% ఎస్జీటీ పోస్టులను డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు కేటాయించడం వల్ల, బీఈడీ అభ్యర్థులు నష్టపోయారు. ఈ నిర్ణయంతో బాధితులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరంతరం పోరాడుతున్నారు.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు నియామకపత్రాలు
న్యాయస్థానాలు కూడా బాధితులకు న్యాయం చేయాలని తీర్పులిచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వారికి న్యాయం చేసే హామీ ఇచ్చింది. కొత్తగా నియమించే టీచర్లకు నెలకు రూ.31,030 వేతనం అందుకుంటారు. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అవసరమైన సర్టిఫికెట్లు, వెరిఫికేషన్ పత్రాలను అందుబాటులో ఉంచారు. అదే విధంగా కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు నియామకపత్రాలు గురువారం సాయంత్రం అందించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఈ నియామకపత్రాలను పంపిణీ చేయనున్నారు.