TS DSC 2023: గుడ్ న్యూస్.. 5089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కేసీఆర్ సర్కార్ పచ్చజెండా ఊపింది. తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో 2575 ఎస్‌జీటీ, 1739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి కోసం మరో రెండు రోజులలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఇదివరకే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, మరో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష
ఈ ధపా టిఎస్పిఎస్సి ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీలు నియమకాలు చేపట్టనున్నాయి. దీని ప్రకారం టెట్ లో క్వాలిఫై అయిన వారు టీఆర్‌టీకి పోటీ పడేందుకు అర్హులుగా గుర్తించనున్నారు. ఇందులో అర్హత సాధించిన వారి వివరాలను జిల్లాల వారీగా జాబితా రూపొందించి డీఎస్సీకి పంపుతారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సెప్టెంబర్ 15న నిర్వహించి, అదే నెల 27న ఫలితాలను వెల్లడించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష.. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.