గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు .. 'నాపై రాళ్లు వేసేవారూ ఉన్నారు'
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే లక్ష్యంగా పరోక్షంగా మాట్లాడారు. తనపై పువ్వులు వేసే వారు ఉన్నాట్లే, రాళ్లు వేసే వారు కూడా ఉన్నారన్నారు. అందరికీ నచ్చాలనేం లేదన్నారు. మంచి పనులు చేసేందుకు అధికారం ఉండాలన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గనన్నారు. తనపై రాళ్లు విసిరితే ఇల్లు కట్టుకుంటానన్నారు. పిన్స్ విసిరితే రక్తంతోనే తన చరిత్రను పుస్తకంగా రాస్తానన్నారు. లోక్‌సభ, శాసనసభలో 33 శాతం మహిళా రిజర్వేషన్ కల్పిస్తున్న సందర్భంగా రాజ్ భవన్ లో "ధన్యవాదాల కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గవర్నర్, మహిళల పక్షాన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
మహిళలు 20 రెట్లు ఎక్కువ పనిచేస్తేనే గుర్తింపు: గవర్నర్
మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓ మహిళా రాష్ట్రపతే సంతకం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అందరూ ఏదో ఓ కలతోనే రాజకీయాల్లోకి వస్తారన్న గవర్నర్, పురుషులతో పోలిస్తే మహిళలు 20 రెట్లు ఎక్కువగా పని చేస్తే తప్ప గుర్తింపు రావట్లేదన్నారు. రాజకీయాలపై ఆసక్తితోనే ఇష్టమైన వైద్యవృత్తిని వదిలిపెట్టాల్సి వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పురుషాధిక్యత పాలిటిక్స్ లో ఎక్కువేనని, దేశంలో దాదాపుగా 15 లక్షల పంచాయతీలకు మహిళలే ప్రెసిడెంట్‌లే ఉన్నారన్నారు. గవర్నర్‌గా తెలంగాణకు వచ్చినప్పుడు మహిళా మంత్రే లేరని, పదవి చేపట్టిన రోజు సాయంత్రమే ఇద్దరు మహిళా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారన్నారు. తనకు మాత్రం ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చినా ఇవ్వకున్నా, తన పని తాను చేసుకుంటూ పోతానన్నారు.