Page Loader
Telangana: నిర్మాణాలు చేపట్టేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. అన్ని జిల్లాల్లోనూ శాండ్‌ బజార్లు ఏర్పాటు
నిర్మాణాలు చేపట్టేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్

Telangana: నిర్మాణాలు చేపట్టేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. అన్ని జిల్లాల్లోనూ శాండ్‌ బజార్లు ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2025
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

'ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు'అనే సామెత వినే ఉంటారు.ఈ రెండు పనులు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవే. మనం ఒక ఖర్చు అంచనా వేసుకుంటే,చివరకు అది రెట్టింపు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుత రోజుల్లో ఇల్లు నిర్మించడం ఓపెద్ద సవాలుగా మారింది.నిర్మాణ వ్యయం అమాంతం పెరిగిపోవడంతో,సిమెంట్,స్టీల్,ఇటుకలు, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ముఖ్యంగా,ఇంటి నిర్మాణంలో ఇసుక కొరత చాలా మందికి ప్రధాన సమస్యగా మారింది. అవసరమైన ఇసుకను సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొంతమంది అధిక ధర చెల్లించి బ్లాక్ మార్కెట్‌లో ఇసుక కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇకపై బ్లాక్ మార్కెట్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు,ఎందుకంటే ప్రభుత్వం తక్కువ ధరకే ఇసుకను సరఫరా చేయడానికి ముందుకొచ్చింది.

వివరాలు 

ఇసుక బజార్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ శాండ్‌(ఇసుక) బజార్లు ఏర్పాటు చేసింది. నగర శివార్లలో అబ్దుల్లాపూర్‌మెట్, బౌరంపేట, వట్టినాగులపల్లిలో ఇప్పటికే ఇసుక బజార్లు ప్రారంభమయ్యాయి. త్వరలో ఆదిభట్ల, పటాన్‌చెరు, ఉప్పల్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇసుక బజార్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగంలో ఉన్నవారికి నాణ్యమైన ఇసుకను అందుబాటులోకి తక్కువ ధరకే తీసుకురావడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

వివరాలు 

అదనంగా వాహన ఖర్చులు

తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (TGMDC) ఆధ్వర్యంలో ఈ ఇసుక బజార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే హెచ్‌ఎండీఏ పరిధిలో శాండ్‌ బజార్‌ కోసం ఇసుకను తరలించేందుకు ఆసక్తి కలిగిన ఏజెన్సీలు, వాహనదారుల నుంచి ప్రభుత్వానికి దరఖాస్తులు కోరారు. హైదరాబాద్‌లో ఈ ప్రక్రియ విజయవంతమైతే, మిగతా జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు. ఇసుక బజార్లలో ధరల పరంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. దొడ్డు ఇసుక టన్ను ధర: ₹1,600 సన్న ఇసుక టన్ను ధర: ₹1,800 అయితే, వాహన ఖర్చులు (ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం అమల్లోకి వస్తే, బ్లాక్ మార్కెట్‌పై ఆధారపడాల్సిన అవసరం తగ్గి, ఇండ్లు నిర్మించుకునే ప్రజలకు పెద్ద స్థాయిలో ఖర్చు ఆదా అవుతుంది.