Hyderabad: హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లను రప్పించడంపై దృష్టి .. నగర బ్రాండ్ పెంపే ప్రభుత్వ లక్ష్యం
ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు, ఫార్మా, ఐటీ కంపెనీలకు నిలయంగా మారిన హైదరాబాద్‌ను ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక విదేశీ వర్సిటీనైనా హైదరాబాద్‌లో స్థాపించడం ద్వారా మన విద్యార్థులకు అత్యుత్తమ అవకాశాలు కల్పించడంతోపాటు నగర బ్రాండ్‌ను మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయమూ, యూకేకు చెందిన ఆక్స్‌ఫర్డ్ యాజమాన్యంతో సమావేశమై హైదరాబాద్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలని, అందుకోసం టాప్ వర్సిటీల యాజమాన్యాలతో మాట్లాడి క్యాంపస్‌లు ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇటీవల సీఎం తెలిపారు.
గత నవంబరులోనే కేంద్రం అనుమతి
భారత్ నుంచి ప్రతి ఏడాదీ 12లక్షల మంది ఉన్నత విద్య కోసం అమెరికా,ఆస్ట్రేలియా,కెనడా,యూకే, జర్మనీ వంటి దేశాలకు వెళ్తున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.ఈ క్రమంలో విదేశీ వర్సిటీల ప్రాంగణాలను దేశంలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2023 నవంబరులో అనుమతిచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో టాప్ 500 వర్సిటీలు యూజీసీకి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ నేపథ్యంలో దాదాపు 10కిపైగా వర్సిటీలు దరఖాస్తు చేసుకున్నట్లు యూజీసీ వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియాకు చెందిన డైకిన్ విశ్వవిద్యాలయం అహ్మదాబాద్‌లోని గిఫ్ట్ సిటీలో క్యాంపస్ ఏర్పాటుకు యూజీసీ నుంచి అనుమతి పొందింది.
అనుమతి కోసం ఎదురుచూస్తున్నమలేసియా, కెనడా వర్సిటీలు
అక్కడ ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25)లోనే తరగతులు ప్రారంభమయ్యాయి.ఈ ప్రాంగణంలో సైబర్ సెక్యూరిటీలో పీజీ కోర్సుకు 3,500 దరఖాస్తులు రావడం విశేషం. మన దేశంలో ప్రాంగణాన్ని ప్రారంభించిన తొలి విదేశీ వర్సిటీగా ఇది గుర్తింపుపొందింది. ఇటీవల యూకేకు చెందిన సౌతాంప్టన్ యూనివర్సిటీ గురుగ్రామ్‌లో క్యాంపస్ ఏర్పాటుకు యూజీసీ నుంచి ప్రాథమిక అనుమతి (ఎల్‌ఓఐ) పొందింది. మలేసియా, కెనడా వర్సిటీలు సైతం దరఖాస్తు చేసి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి.
రాష్ట్రంపై లింకన్ వర్సిటీ ఆసక్తి
రాష్ట్రంలో ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు మలేసియాకు చెందిన లింకన్ యూనివర్సిటీ కొద్ది నెలల క్రితం యూజీసీకి దరఖాస్తు చేసింది. ఈ యూనివర్సిటీ క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్‌లో 301-340 పరిధిలో ఉంది.అయితే, యూజీసీ ఇంకా దీనికి అనుమతిని ఇవ్వలేదు. హైదరాబాదుకు సమీపంలోని శివార్లలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసే అవకాశముందని ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్‌బీ),బిట్స్ పిలానీ క్యాంపస్, నల్సార్, ఐఐటీ, కేంద్ర విశ్వవిద్యాలయాలతో కూడి హైదరాబాద్ ఇప్పటికే ఒక విద్యా హబ్‌గా మారిపోయింది. స్కిల్ యూనివర్సిటీకి కూడా ఇటీవల ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటితో పాటు, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు కూడా ఏర్పడితే, హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదగడంలో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.