
New Ration Card: ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల అఫ్లికేషన్లు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ జరుగుతున్న విషయం తెలిసిందే.
జనవరి 26 నుండి ప్రభుత్వం కొత్త కార్డులను మంజూరు చేయడం ప్రారంభించింది.
గతంలో ప్రజావాణి, ప్రజాపాలన, గ్రామసభల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ కార్డులు మంజూరు చేశారు.
అయితే, గత మూడ్రోజులుగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియపై గందరగోళం నెలకొంది.
ఈనెల 7న సివిల్ సప్లయ్ అధికారులు, మీ సేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు.
దీనికి అనుగుణంగా అధికారిక ఆదేశాలు కూడా విడుదల చేశారు.
అదే రోజు రాత్రి 8 గంటలకు మీ సేవ పోర్టల్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
వివరాలు
స్పష్టత ఇచ్చిన పౌర సరఫరాల శాఖ అధికారులు
ఇది చూసిన ప్రజలు మరుసటి ఉదయం పెద్ద ఎత్తున మీ సేవ కేంద్రాలకు తరలివచ్చారు.
అయితే, కొద్ది గంటల తర్వాత ఈ ఆప్షన్‌ను పోర్టల్‌లో నుండి తొలగించారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ మార్పు జరిగిందని మీ సేవ నిర్వాహకులు తెలిపారు.
ఈ ఘటనతో, ఆశగా వచ్చిన ప్రజలు నిరాశకు గురయ్యారు. ఈ అంశంపై మూడు రోజులుగా పెద్ద చర్చ కొనసాగింది.
తాజాగా, పౌర సరఫరాల శాఖ అధికారులు దీనిపై స్పష్టతనిచ్చారు.
రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు.
సోమవారం సివిల్ సప్లయి అధికారులు మీ సేవ అధికారులతో సమావేశమై, ప్రజాపాలన, ప్రజావాణి ద్వారా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి అప్లై చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
వివరాలు
కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ పునఃప్రారంభం
ఈ నేపథ్యంలో, మీ సేవ పోర్టల్‌లో 'మీ-దరఖాస్తుల స్వీకరణ' ఆప్షన్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చారు.
సోమవారం సాయంత్రం నుంచే కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ పునఃప్రారంభమైంది.
ఇప్పటికే ప్రజాపాలన, కుల గణన, ప్రజావాణి, గ్రామసభల్లో దరఖాస్తు చేసిన వారు మళ్లీ మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని పేర్కొన్నారు.
రేషన్ కార్డుల మంజూరు నిరంతరాయంగా కొనసాగుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు.