Telangana: రైతుల కోసం తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం.. సాయిల్ హెల్త్ వ్యవస్థ..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అమలైన వాలంటీర్ వ్యవస్థ గురించి అందరికీ తెలుసు. గ్రామాల జనాభా ఆధారంగా వాలంటీర్లను నియమించిన ఆ విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ వ్యవస్థపై వివిధ విమర్శలు, ఆరోపణలు కూడా వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కూడా వాలంటీర్ విధానాన్ని కొత్త రూపంలో తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. రైతులకు నేరుగా ఉపయోగపడేలా "సాయిల్ హెల్త్ వాలంటీర్లు" అనే కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు వాలంటీర్లను నియమించే ప్రణాళిక ఉంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది వాలంటీర్లను నియమించనున్నారు.
వివరాలు
వాలంటీర్ల బాధ్యతలు ఇవే..
ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్లు రైతులకు భూసారం సంరక్షణపై మార్గనిర్దేశం చేస్తారు. పంటలకు అనుగుణంగా భూమిని ఎలా సిద్ధం చేయాలి, నేల నాణ్యతను ఎలా మెరుగుపరచాలి వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే విధానాలపై సూచనలు అందిస్తారు. ఈ వాలంటీర్లకు ముందుగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.ICRISATలో మొదటి విడతగా శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. తెలంగాణ వ్యవసాయశాఖతో కలిసి ఇక్రిశాట్ ఈ నియామకాలు చేపడుతోంది. ప్రారంభ దశలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి ఎంపికైన వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నారు. భూసారం,పంటల సాగు వంటి అన్ని అంశాలపై వీరికి పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక వారు గ్రామాల్లో సేవలు ప్రారంభిస్తారు.
వివరాలు
సేంద్రీయ వ్యవసాయం వైపు దృష్టి
భూసార ఆరోగ్యాన్ని పరిరక్షించడం ఉద్యమంలా తీసుకెళ్తామని మంత్రి తుమ్మల తెలిపారు. పంట కోత తర్వాత మిగిలే అవశేషాలను తగలబెట్టకుండా ఎరువులుగా మార్చుకోవాలని రైతులకు సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ ఎరువులను ఎక్కువగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. భూమిలో రసాయనాల ప్రభావం తగ్గితే పౌష్టికాహారంతో కూడిన పంటలు పండుతాయని అన్నారు. జీలుగు, పిల్లిపెసర, పచ్చిరొట్ట వంటి విత్తనాలతో భూసారాన్ని పెంచుకోవచ్చని వివరించారు. ఇదిలా ఉండగా, మే 4 నుంచి 9 వరకు రాష్ట్రంలో రైతు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున రైతులు పాల్గొనాలని ప్రభుత్వం కోరింది.