LOADING...
Tummala Nageshwar Rao: కేంద్రానికి తెలంగాణ చేనేత సమస్యలు.. 5శాతం జీఎస్టీ రద్దు చేయాలని మంత్రి లేఖ
కేంద్రానికి తెలంగాణ చేనేత సమస్యలు.. 5శాతం జీఎస్టీ రద్దు చేయాలని మంత్రి లేఖ

Tummala Nageshwar Rao: కేంద్రానికి తెలంగాణ చేనేత సమస్యలు.. 5శాతం జీఎస్టీ రద్దు చేయాలని మంత్రి లేఖ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

తక్షణమే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర హస్తకళల, చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్ర హస్తకళల పరిశ్రమకు ఊపిరిలాంటి చేనేత రంగం, కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీ వల్ల ప్రస్తుతం తీవ్ర సమస్యల్లో ఉందని వివరించారు. వ్యవసాయం తర్వాత పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించే ఈ రంగం, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులకు జీవనాధారమని మంత్రి తెలిపారు.

Details

తక్కువ వ్యయంతో వస్త్రాల ఉత్పత్తి

మంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం, పోచంపల్లి ఇక్కట్, గద్వాల్ చీరలు, నారాయణపేట చీరలు, సిద్ధిపేట గొల్లభామ చీరలు, వరంగల్ దర్రీస్, కరీంనగర్ డబుల్ క్లాత్ చెద్దర్లు వంటి ఉత్పత్తులు అందం, నాణ్యత, సృజనాత్మకతకు అద్దం పట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినట్లు చెప్పారు. వీటిలో ఆరు రకాల ఉత్పత్తులు జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద నమోదైనవి. ప్రస్తుతానికి రాష్ట్రంలో 23,046 చేనేత కార్మికులు, 34,569 అనుబంధ కార్మికులు ఈ రంగంలో పని చేస్తున్నారు. ముడి సరకుల ధరలు పెరగడం, పవర్‌లూమ్, మిల్ రంగాల్లో తక్కువ వ్యయంతో వస్త్రాల ఉత్పత్తి జరగడం వల్ల చేనేత ఉత్పత్తులను తయారు చేసే నేత కార్మికులకు మార్కెట్లో గిరాకీ తగ్గడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతోంది.

Details

జీఎస్టీపై మినహాయింపు ఇవ్వాలి

5 శాతం జీఎస్టీ విధించడం వల్ల చేనేత వస్త్రాల ధరలు పెరుగుతుండటంతో వినియోగం తగ్గి, కార్మికుల జీవనాధారం సంక్షోభంలో పడుతున్నదని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో నేతన్నలు తమ సంప్రదాయ వృత్తిని వదిలి వలస వెళ్లే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. ఖాదీ రంగానికి జీఎస్టీ మినహాయింపు ఉన్నప్పటికీ చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ కొనసాగించడం అన్యాయమని చెప్పారు. మరి చేనేత కార్మికుల ప్రయోజనాలను కాపాడటం, వారికోసం నిరంతరం ఉపాధి కల్పించడం, భారతీయ చేనేత కళా వారసత్వాన్ని భవిష్యత్తుకి అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.