
Justice Girija Priya Darsini: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జిగా సేవలందిస్తున్న జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని (61) ఆదివారం ఉదయం కన్నుమూశారు.
కొద్దీ రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.
అంత్యక్రియలు సోమవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
జస్టిస్ ప్రియదర్శినీ మృతి పట్ల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోరు పాల్, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Details
1995లో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన ప్రియదర్శని
1995లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన జస్టిస్ ప్రియదర్శిని, విశాఖపట్నంలో సివిల్, క్రిమినల్, లేబర్ లా వంటి అనేక కేసులను వాదించారు.
అనంతరం 2008 నవంబర్‌లో నేరుగా జిల్లా జడ్జిగా ఎంపికై న్యాయ సేవల్లో ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహించారు.
పదోన్నతితో 2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆమె సీనియారిటీ ప్రాతిపదికన 16వ స్థానంలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆమె పదవీ విరమణకు సిద్ధమవ్వాల్సి ఉంది.
Details
లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసిన ప్రియదర్శని
విశాఖపట్నంలోని ఎన్‌బిఎం లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆమె, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు.
అంతేకాకుండా సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ వంటి విభాగాలలో మాస్టర్స్ డిగ్రీలు కూడా ఆమె పొందారు.
జస్టిస్ ప్రియదర్శిని, వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన మాటూరి అప్పారావు, నాగరత్నం దంపతులకు జన్మించారు.
ఇంటర్మీడియట్ అనంతరం ఆమె డాక్టర్ కె. విజయ్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెకు భర్త డాక్టర్ కె. విజయ్ కుమార్‌తో పాటు ఇద్దరు కుమారులు నిఖిల్, అఖిల్ ఉన్నారు.