
TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో లింక్, మొబైల్‌కు మెసేజ్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.
మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇంటర్ బోర్డు సభ్యులు హాజరయ్యారు.
ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలను విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tgbie.cgg.gov.in ద్వారా చూసుకోవచ్చు.
విద్యార్థుల సౌలభ్యం కోసం ఈసారి ఫలితాల లింక్‌ను వారి మొబైల్ ఫోన్లకు పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
లింక్‌ను ఓపెన్ చేసి, హాల్ టికెట్ వివరాలను నమోదు చేయడం ద్వారా ఫలితాలను పొందొచ్చని వారు తెలిపారు.
వివరాలు
ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ నిర్వహణ బాధ్యత చేపట్టిన సీజీజీ
గత సంవత్సరాల్లో ఫలితాల విడుదల సమయంలో సర్వర్ సమస్యలు ఎదురైన సందర్భాలను గుర్తుచేస్తూ, ఈసారి అటువంటి సాంకేతిక ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది.
ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ నిర్వహణ బాధ్యతను కూడా సీజీజీ చేపట్టింది.
ఫలితాల విడుదలకు ముందే, విద్యార్థుల మనోధైర్యాన్ని పెంపొందించేందుకు ఇంటర్మీడియట్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒక సందేశాన్ని పంపించారు.
సోమవారం ఆయన పంపిన ఎస్‌ఎంఎస్ ద్వారా "పరీక్షల్లో విజయం లేదా పరాజయం అనేవి సహజం.
ఆశించిన ఫలితాలు రాకపోయినా నిరుత్సాహ పడకండి. కృషిని రెట్టింపు చేయండి, పట్టుదలతో ముందుకు సాగండి, విజయం మీను తృప్తిపరిచే స్థాయికి చేరుకుంటుంది" అని ఉత్సాహభరితంగా హితవు చెప్పారు.
వివరాలు
పరీక్షలకు 9,96,971 మంది విద్యార్థులు హాజరు
మార్కుల ఆధారంగా మాత్రమే విద్యార్థుల ప్రతిభను నిర్ణయించలేమని స్పష్టం చేస్తూ, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తులను గుర్తించి, వారికి ప్రోత్సాహం అందించాలని, మద్దతుగా నిలవాలని ఆయన సూచించారు.
ఫలితాల తరువాత మానసిక ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు టెలీమానస్ టోల్‌ఫ్రీ నంబర్ 1800 891 4416కు కాల్ చేసి సలహాలు పొందవచ్చునని అధికారులు చెప్పారు.
ఈ సంవత్సరం మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారిక సమాచారం.