Page Loader
తెలంగాణలో సంక్షేమం తప్ప సంక్షోభం లేదు; అసెంబ్లీలో మంత్రి కేటీఆర్  
పల్లె పట్టణ ప్రగతిపై మంత్రి కేటీఆర్ స్పందన, సంక్షేమం తప్ప సంక్షోభం ఉండబోదు

తెలంగాణలో సంక్షేమం తప్ప సంక్షోభం లేదు; అసెంబ్లీలో మంత్రి కేటీఆర్  

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 05, 2023
06:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ మేరకు పల్లె, పట్టణ ప్రగతిపై శనివారం ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణలో సంక్షేమం తప్ప, సంక్షోభం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి అని అన్నారు. గ్రామాలు, పట్టణాలకు సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో సమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మరోవైపు వ్యవసాయం, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్లు వృద్ధిలో పయనిస్తున్నాయన్నారు. బడ్జెట్ అంటే విపక్షాలకు జమ, ఖర్చుల లెక్క మాత్రమేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమకు మాత్రం ప్రజల జీవనరేఖ అని చెప్పారు. బడ్జెట్‌లో 26శాతం మేర మౌలిక వసతులపై ఖర్చు చేస్తున్నామన్నారు.

DEETAILS

బ‌డ్జెట్ పెట్టుబ‌డి వ్య‌యంలో తెలంగాణే ముందు: కేటీఆర్ 

9ఏళ్లుగా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బ‌డ్జెట్ పెట్టుబ‌డి వ్య‌యంలో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ 15 శాతం, రాజ‌స్థాన్‌ 16శాతం మాత్ర‌మే ఉందన్నారు. అదే తెలంగాణ‌లో 26శాతాన్ని పెట్టుబ‌డి వ్య‌యంగా పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. తాను చెప్పినదాంట్లో త‌ప్పులుంటే ఎన్నిక‌ల్లో ఓడించాలని స‌వాల్ చేశారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తితో తెలంగాణ‌లో ప‌ల్లెలు మురిశాయని, ప‌ట్ట‌ణం మెరిసిందన్నారు. 9ఏళ్ల క్రితం తెలంగాణ దుస్థితిపై, కాంగ్రెస్ పాల‌న వైఫల్యంపై ఆనాటి స‌భ‌లోనే రేవంత్ రెడ్డి పూర్తిగా వివరించారని చురకలు అంటించారు. 2022 జ‌న‌వ‌రి నుంచి కాంగ్రెస్ సీఎల్పీ నేత భ‌ట్టి ఒక్క ట్యాంక‌ర్ బుక్ చేయ‌లేదన్నారు. న‌గ‌రంలో ఒక్కో ఇంటికి 20 వేల లీట‌ర్ల మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు.