గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ కార్మీక యూనియన్ కీలక చర్చలు.. త్వరలోనే బిల్లుకు గ్రీన్ సిగ్నల్
టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్ సానుకూలంగా స్పందించారు. బిల్లులోని 5 అంశాలపై ఇప్పటికే తమిళిసై ప్రభుత్వ వివరణ కోరారు. తాజాగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులతో ఆమె చర్చలకు ముందుకొచ్చారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్, హైదరాబాద్ రాజ్‌భవన్‌కు తరలివచ్చిన ఆర్టీసీ యూనియన్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. ఈ మేరకు TMU అధ్యక్ష, కార్యదర్శులు ఎ.ఆర్.రెడ్డి, థామస్‌రెడ్డిలతో కూడిన 10 మంది బృందం చర్చలు జరిపింది. తమ సమస్యలను గవర్నర్‌తో చెప్పామని, అందుకు తాను సానుకూలంగానే స్పందించినట్లు యూనియన్ వెల్లడించింది. బిల్లులో గవర్నర్ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం నుంచి వివరణ వచ్చాక బిల్లు ఆమోదించనున్నట్లు చెప్పారన్నారు. తమకు కార్మికుల ప్రయోజనాలే ముఖ్యమని గవర్నర్ తమతో చెప్పిన్నట్లు యూనియన్ పేర్కొంది.
బిల్లుపై వివరణ ఇచ్చిన ప్రభుత్వం
వివరణ ఇచ్చిన ప్రభుత్వం : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుపై అంతకుముందు గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సదరు బిల్లుకు త్వరలోనే గవర్నర్ ఆమోదం లభిస్తుందని యూనియన్ నేత థామస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బిల్లు ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ రాజధాని హైదరాబాద్ లో కార్మికులు రోడ్లమీదకి వచ్చారు. వందలాదిగా ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడించారు. మరోవైపు కార్మికుల నిరసనలు, ధర్నాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ మేరకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని కార్మిక సంఘాలకు గవర్నర్ సూచనలు చేశారు.