ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలను బిల్లులో పొందుపర్చాలని ప్రభుత్వానికి సూచన
టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. బిల్లులోని పలు అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలు సందేహాలకు ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. కార్మికుల భవిష్యత్, ప్రయోజనాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత అడిగారు. బిల్లులో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాలకు సంబంధించి వివరాలు పొందుపర్చలేదని గవర్నర్ అన్నారు. ఆర్టీసీ వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా? లేదా? అనే అంశాన్ని బిల్లులో చెప్పలేదన్నారు. పదోన్నతులు, క్యాడర్ అలాట్ మెంట్ విషయంలోనూ స్పష్టతంగా పేర్కొనలేదన్నారు. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు అందించనున్న ప్రయోజనాలను బిల్లులో స్పష్టంగా పొందుపరచాలని ప్రభుత్వానికి సూచించారు. గతంలో తాను కార్మికుల పక్షానే ఉన్నానన్న తమిళిసై ఇప్పుడూ వారి వెంటే ఉంటానన్నారు.