Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 3 రోజులే.. బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదట కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల శాసన సభ నివాళులర్పించింది. అనంతరం సభ వాయిదా పడింది. తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తారని అంతా భావించారు. అయితే మూడు రోజుల పాటు మాత్రమే సమావేశాలు నిర్వహించాలని బీఏసీ స్పష్టం చేసింది. ప్రభుత్వం తరుపున హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, ఎంఐఎం తరుపున అక్బరద్దీన్ ఒవైసీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ నాయకుల్ని అడ్డుకున్న పోలీసులు
ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సూమారు 10 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీలో జరిగిన బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవడంపై ఎమ్మెల్యే ఈటల అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఒక సభ్యుడు ఉన్న లోక్ సత్తా పార్టీని కూడా బీఏసీకి పిలిచేవారని, ప్రస్తుతం బీజేపీని పిలవకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మూడు రోజులే అసెంబ్లీ సమావేశాలను జరపడం సిగ్గుచేటని, ప్రభుత్వానికి ప్రజా సమస్యల మీద చర్చించాలనే తపన లేదని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ నేతల్ని అసెంబ్లీ ఎదుట పోలీసులు అడ్డుకున్నారు.