Telangana elections: 6 సార్ల ఎమ్మెల్యే గడ్డిగారి గడ్డెన్న తెలుసా, ఎన్నికల్లో ఓటేస్తూనే తుదిశ్వాస విడిచారు
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో రాజకీయ నాయకులంటే చదవు లేకపోయినా, పెద్ద పెద్ద బారిస్టర్ విద్యలు చదవకపోయినా రాజకీయాల్లో రాణించేవారు. ముక్క అక్షరమైనా చదువుకోని వ్యక్తి అయినా పెద్ద పదవులను అలంకరించేవారు. దీని అర్థం రాజకీయాలంటే సేవా భావం అని. ఈ మేరకు తెలంగాణలోని ముథోల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గడ్డిగారి గడ్డెన్న అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలియని వారుండరు. తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన గడ్డెన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిబద్ధతకు మారు పేరుగా నిలిచిన ఈయన్ను ఓసారి మంత్రి పదవే వెతుక్కుంటూ వచ్చింది. నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాంకు చెందిన గడ్డెన్న అసలు పేరు నర్సింహారెడ్డి.
కాంగ్రెస్ పక్షాన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు
రాజకీయాల్లో గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గడ్డెన్న, సర్పంచిగా గెలిచారు. అనంతరం ముథోల్ పంచాయతీ సమితి ఛైర్మన్‌గా, భైంసా ఏఎంసీ అధ్యక్షుడిగానూ పని చేశారు. 1967లో ముథోల్ ఎమ్మెల్యేగా ఏకగ్రీవమయ్యారు. 1972, 1977, 1983, 1989, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన ఎమ్మెల్యేగా గెలుపొందారు.1992లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో బీసీ శాఖ మంత్రిగా హైదరాబాద్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీలతో సన్నిహిత సంబంధాలున్న గడ్డెన్న, భైంసా సుద్దవాగుపై జలాశయ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. 2004 ఏప్రిల్ 21న ఎన్నికల్లో ఓటేసిన నిమిషాల వ్యవధిలోనే తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన గర్తుగా అప్పటి సీఎం వైఎస్ సుద్దవాగు జలాశయానికి గడ్డెన్న పేరునే పెట్టారు.