Page Loader
Gig Workers: 4లక్షల మందికిపైగా ఉన్న గిగ్,ప్లాట్‌ఫాం వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా..తుది ముసాయిదా బిల్లు సిద్ధం చేసిన కార్మికశాఖ

Gig Workers: 4లక్షల మందికిపైగా ఉన్న గిగ్,ప్లాట్‌ఫాం వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా..తుది ముసాయిదా బిల్లు సిద్ధం చేసిన కార్మికశాఖ

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో దాదాపు నాలుగు లక్షల మందికిపైగా ఉన్న గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులకు ఉద్యోగ భద్రత, బీమా,ఇతర హక్కులను కల్పించేందుకు రూపొందించిన తుది ముసాయిదా బిల్లుకు తుది రూపురేఖలు పూర్తయ్యాయి. ఈ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్దేశం. ఈ బోర్డు ఆధ్వర్యంలోనే ప్రభుత్వమే అన్ని సంక్షేమ, సామాజిక భద్రత కార్యక్రమాలను అమలు చేయనుంది. బీమా, రక్షణ,ఇతర హక్కుల నిమిత్తంగా ఓ ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయనున్నారు. ఈ బిల్లులో, గిగ్ కార్మికులకు ప్రత్యేక గుర్తింపు నంబర్‌ను ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. త్వరలో ఈ బిల్లుకు ఆమోదం ఇచ్చి అమలు దిశగా చర్యలు చేపట్టేందుకు యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది.

వివరాలు 

అగ్రిగేటర్ల సూచనలు బిల్లులో ప్రతిఫలించాయి 

కార్మిక సంఘాలు, అగ్రిగేటర్లు, కార్మికులు, ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించి, వాటి ఆధారంగా కార్మిక శాఖ తుది బిల్లును సిద్ధం చేసింది. గిగ్,ప్లాట్‌ఫాం కార్మికుల కోసం రూపొందించిన ముసాయిదా బిల్లును కార్మికశాఖ ఏప్రిల్ 14న విడుదల చేసి, ప్రజల అభిప్రాయాలను కోరింది. మొదట మే 1 నాటికే చట్టాన్ని అమలు చేయాలని భావించి, ఏప్రిల్ 28 వరకు సూచనలు ఇవ్వమని ప్రజలను కోరారు. అయితే, కొంతమంది అగ్రిగేటర్లు తమ సూచనల కోసం మరింత సమయం కావాలని అభ్యర్థించడంతో ప్రభుత్వం మరో మూడు వారాల గడువు ఇచ్చింది. ప్రస్తుతం తుది ముసాయిదా సిద్ధమైన నేపథ్యంలో,మంత్రి మండలి ఆమోదం పొందిన వెంటనే ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించారు.

వివరాలు 

తుది బిల్లులో ముఖ్యమైన అంశాలు ఇవే 

ఈ చట్టాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అనుగుణంగా అమలులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. సంక్షేమ బోర్డు ఏర్పాటు: ఈ బోర్డుకు కార్మికశాఖ మంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. కార్మిక, ఐటీ, ఆర్థిక, వాణిజ్య పన్నులు, రవాణా శాఖల అధిపతులు, కార్మికశాఖ కమిషనర్ బోర్డు సభ్యులుగా ఉంటారు. బోర్డు సీఈవో మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తారు. కార్మికుల నుంచి నలుగురు, అగ్రిగేటర్ల నుంచి నలుగురు, గిగ్ వర్కర్ల కోసం పనిచేస్తున్న సంఘాల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులుగా ఉంటారు. వర్కర్లు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలి: తెలంగాణలో సేవలందిస్తున్న ప్రతి గిగ్, ప్లాట్‌ఫాం వర్కరు, వారు స్థానికంగా అయినా, దేశీయంగా అయినా లేదా అంతర్జాతీయంగా పనిచేస్తున్నా, తప్పనిసరిగా బోర్డు వద్ద తమను నమోదు చేయాలి.

వివరాలు 

తుది బిల్లులో ముఖ్యమైన అంశాలు ఇవే 

అగ్రిగేటర్ల బాధ్యతలు: ప్రతి మూడు నెలలకోసారి తమ వద్ద నమోదైన వర్కర్ల వివరాల్లో జరిగే మార్పులు, చేర్పులను అగ్రిగేటర్లు బోర్డుకు తెలియజేయాలి. సంక్షేమ నిధి ఏర్పాటు: కార్మికుల సామాజిక భద్రత, బీమా పథకాల కోసం ప్రభుత్వం ఓ ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తుంది. ఇందులో ప్రభుత్వ గ్రాంట్లు, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, వర్కర్లు స్వచ్ఛందంగా ఇచ్చే నిధులు ఉండేలా చూస్తారు. నిధిలోకి లావాదేవీ ఆధారంగా శాతం చెల్లింపు: వర్కర్‌కు ప్రతి లావాదేవీకి సంబంధించిన చెల్లింపుల్లో అగ్రిగేటర్లు 1 శాతం నుంచి 2 శాతం వరకు ఆ నిధికి జమ చేయాలి. ప్రతి త్రైమాసికం చివర్లో ఈ చెల్లింపులు చేయాలి. ఆలస్యమైతే, ప్రభుత్వం నిర్ణయించే సాధారణ వడ్డీతో కలిపి చెల్లించాలి.

వివరాలు 

తుది బిల్లులో ముఖ్యమైన అంశాలు ఇవే 

శిక్షలు: అగ్రిగేటర్ లేదా యాజమాన్యం సంక్షేమ నిధికి తగిన ఫీజు చెల్లించకుంటే, వారికి ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ.2 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. వార్నింగ్ లేకుండా తొలగింపు నిషేధం: వారం రోజుల ముందుగా నోటీసు ఇవ్వకుండా వర్కర్లను తొలగించరాదు. ఒప్పందంలో పేర్కొన్నట్లుగానే యాజమాన్యం వారికి చెల్లింపులు చేయాలి. వినియోగదారులకు వేధింపులపై చర్యలు: వినియోగదారులను భౌతికంగా లేదా మానసికంగా వేధించినట్లు నిరూపితమైతే, వర్కర్‌ను తక్షణమే తొలగించవచ్చు.

వివరాలు 

అసంతృప్తి ఉంటే,90 రోజుల లోగా..

ఫిర్యాదుల పరిష్కారం కోసం అధికారి నియామకం: వర్కర్ల ఉద్యోగ భద్రత, బీమా మరియు ఇతర ప్రోత్సాహకాలపై వచ్చే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమిస్తుంది. వర్కర్లు వెబ్‌పోర్టల్ లేదా ఇతర మార్గాల్లో ఫిర్యాదులు ఇచ్చినట్లయితే, ఆయా అధికారులు 30 రోజుల్లో విచారణ చేసి తగిన ఆదేశాలు ఇవ్వాలి. అప్పీలుకు అవకాశం: విచారణ అధికారి ఆదేశాలతో అసంతృప్తి ఉంటే,90 రోజుల లోగా డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉండే అప్పిలేట్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు.