LOADING...
#NewsBytesExplainer: చట్టాలు పుస్తకాలకే పరిమితం.. భూమి సమస్యల పరిష్కారానికి మార్గం ఎక్కడ?
చట్టాలు పుస్తకాలకే పరిమితం.. భూమి సమస్యల పరిష్కారానికి మార్గం ఎక్కడ?

#NewsBytesExplainer: చట్టాలు పుస్తకాలకే పరిమితం.. భూమి సమస్యల పరిష్కారానికి మార్గం ఎక్కడ?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో భూమి సమస్యల పరిష్కారానికి అవసరమైన అనేక విప్లవాత్మక చట్టాలు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నా, అవి అమలులో మాత్రం సరైన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. కొత్త చట్టాలు వచ్చినప్పుడల్లా, వాటి వల్ల సమస్యలు కూడా కొత్తగా ఉద్భవిస్తున్నాయని వారు చెబుతున్నారు. తెలంగాణలో జాగీర్దార్ అబాలిషన్ చట్టం, టెనెన్సీ యాక్ట్, భూమి సీలింగ్ చట్టం, ఆర్వోఆర్ చట్టం, అసైన్డ్ భూముల చట్టం, ధరణి చట్టం, ఇటీవల తీసుకొచ్చిన భూ భారతీ చట్టం వంటి అనేక చట్టాలు ఉన్నప్పటికీ, రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయిలో వీటిని అమలు చేయకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదని, సమస్యలు మరింత పెరిగిపోయాయని విమర్శలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

ఎన్నికలకు ముందు దాదాపు 30 లక్షల భూమి సమస్యలు.. సదస్సుల సమయంలో కేవలం 8.60 లక్షల దరఖాస్తులు

బీఆరెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టం రైతులకు, భూమి యజమానులకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేసి, భూ భారతీ-5 పేరుతో ఒక నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కలిగించేందుకు మండల స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించినా, రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ స్వీకరించకుండా తిరస్కరించారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ దాదాపు 30 లక్షల భూమి సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పింది. అయితే, సదస్సుల సమయంలో కేవలం 8.60 లక్షల దరఖాస్తులు మాత్రమే ఎలా వచ్చాయన్న ప్రశ్నలను రైతు సంఘాల నాయకులు లేవనెత్తుతున్నారు.

వివరాలు 

రైతులకు చట్టంపై పూర్తి అవగాహన

ధరణి చట్టం అమలులో లక్షల సమస్యలు ఉండగా, భూ భారతీతో ఇవన్నీ సులభంగా పరిష్కారమవుతాయా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలు ఉన్నప్పుడు వాటికి తగిన మార్గం ఎంచుకుని ఎవరో ఒకరు పరిష్కరించాలి కదా? అనేది వారి అభిప్రాయం. చట్టాన్ని రూపొందించడం మాత్రమే కాకుండా,దాన్ని సమర్థవంతంగా అమలు చేసే యంత్రాంగం కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని భూమి వ్యవహారాల్లో అనుభవం ఉన్న ఓ సీనియర్ న్యాయవాది అభిప్రాయపడ్డారు. రైతులకు చట్టంపై పూర్తి అవగాహన ఉండాలి. అలాగే, ఫీల్డ్ స్థాయిలో పనిచేసే సిబ్బంది,అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. వారి దృష్టిని రైతుల ప్రయోజనాలపై కేంద్రీకరించాలి అని నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్ అన్నారు.

వివరాలు 

ఎల్ఈసీ కార్డుల కోసం రఘువీరారెడ్డి  కృషి

రెవెన్యూ అధికారుల వ్యవహారం రైతుల పట్ల సానుకూలంగా ఉండాలన్నది ఆయన అభిప్రాయం. రైతులు తమ సమస్యలను చెప్పగలగాలి. 'ఈ చట్టంలో ఇది నా సమస్య, దీన్ని ఇలా పరిష్కరించండి' అని అధికారులను నిలదీసేంత అవగాహన రైతులకు ఉండాలన్నది భూమి సునీల్ అభిప్రాయం. చట్టాల అమలుకు రెవెన్యూ శాఖ ప్రధానంగా పనిచేసేలా ఉండాలన్నారు. రఘువీరారెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఎల్ఈసీ కార్డుల కోసం కృషి చేసి, అనేక మంది కౌలు రైతులకు వాటిని ఇప్పించారని ఆయన గుర్తుచేశారు. భూ భారతీ-2025 చట్టానికి సంబంధించి మండల స్థాయిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులు కేవలం అనుసరణగా జరిగాయే తప్ప, వాటి వెనుక నిజమైన లక్ష్యం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

వివరాలు 

తెలంగాణలో దరఖాస్తులను తీసుకోవడంలో నిర్లక్ష్యం

న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం,ఈ తరహా సదస్సులు గ్రామ స్థాయిలో జరిగితేనే నిజమైన ప్రయోజనం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామస్థాయిలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులను అదే సమయంలో స్కాన్ చేసి, కంప్యూటర్లోకి ఎక్కించి, అప్లికేషన్‌కు నంబర్ కేటాయించి, దరఖాస్తుదారుల ఫోన్ నంబర్లకు మెసేజ్ పంపించే విధానాన్ని అవలంబించారు. అధికారుల రాక, దరఖాస్తు పరిష్కారం వంటి విషయాలను కూడా ఫిర్యాదుదారులకు తెలియజేస్తూ, చివరికి తగిన నిర్ణయాలను ఎమ్మార్వో లాంటి అధికారులు రాతపూర్వకంగా జారీ చేసేవారు. కానీ తెలంగాణలో ఈ విధానం కనిపించలేదని రైతులు చెబుతున్నారు. అక్కడ దరఖాస్తులను స్కాన్ చేయలేదు, కనీసం ఎక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. అనేక మంది దరఖాస్తులను తీసుకోవడంలో నిర్లక్ష్యం చేశారని సమాచారం.

వివరాలు 

జరగని సీసీఎల్ఏ నియామకం

ఈ నేపథ్యంలోనే భూ భారతీ చట్టం ప్రారంభ దశలోనే అనేక విమర్శలకు లోనవుతోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వమే కావాలనే రెవెన్యూ శాఖను నిర్జీవం చేసిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భూమి పరిపాలనకు కీలకమైన సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ లాండ్ అడ్మినిస్ట్రేషన్) పదవిని బీఆరెస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో ఎందుకు నియమించలేదన్న ప్రశ్నలు చోటుచేసుకున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు కేవలం 7 నెలల పాటు రేమండ్ పీటర్ పనిచేసిన సందర్భం మినహాయిస్తే, సీసీఎల్ఏ నియామకం జరగలేదు. కొంతకాలం సీఎస్‌, మరికొంతకాలం రెవెన్యూ కార్యదర్శిని ఇన్‌చార్జిగా నియమించినంత మాత్రాన భూమి పరిపాలనలో ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయా అని సీనియర్ జర్నలిస్టులు పేర్కొంటున్నారు.

వివరాలు 

భూ భారతీ చట్టం అమలులో తాసిల్దార్లకు పూర్తి అధికారాలు బదలాయించకపోవడంపై అసంతృప్తి

భూమి పరిపాలన చక్కగా జరిగితేనే భూమికి సంబంధించి ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎంత అభివృద్ధి చెందిన చట్టం ఉన్నా,దాన్ని అమలు చేసే వ్యవస్థ శక్తివంతంగా లేకపోతే ప్రయోజనం ఉండదని న్యాయ నిపుణులు అంటున్నారు. మండల స్థాయిలో స్టాఫ్‌, గ్రామస్థాయిలో అధికారులు తక్షణం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగా భూ భారతీ చట్టం అద్భుతమైనదే అయినా, దాని అమలులో తాసిల్దార్లకు పూర్తి అధికారాలు బదలాయించకపోవడం వల్ల అసంతృప్తి పెరిగిపోతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

తాసిల్దార్లు దరఖాస్తులను స్వీకరించలేదన్న ఆరోపణలు

బీఆరెస్ పాలనలో చేసినట్టు తాసిల్దార్లను కేవలం రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లకు మాత్రమే పరిమితం చేయడం వల్ల ప్రజల నిత్య సంబంధాలు ఉన్న అధికారుల వద్దే అధికారాలు లేకపోవడం ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ అభిమాని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తాసిల్దార్లు దరఖాస్తులను స్వీకరించలేదన్న ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వం వచ్చిన వెంటనే తాసిల్దార్ల అధికారాలను తగ్గించడమే కాకుండా, సాదాబైనామాల అమలులో మార్పులు చేయకుండా ఉండటంతో, కోర్టుల్లో ఉన్న స్టేలను తొలగించే చొరవ చూపకపోవడంతో 8 లక్షల దరఖాస్తులు ఎలా పరిష్కరించబోతున్నారని రెవెన్యూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

వివరాలు 

 భూ భారతీలో దరఖాస్తుకు రూ.1000 వసూలు 

ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఉచితంగా దరఖాస్తులు తీసుకుంటామన్నారు. కానీ భూ భారతీలో దరఖాస్తుకు రూ.1000 వసూలు చేయడం ఏ విధంగా సమంజసం? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ ప్రభుత్వం తిరిగి పరిగణనలోకి తీసుకుని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందని సీనియర్ జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు.