TG News: తెలంగాణ తల్లి రూప మార్పు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
సచివాలయంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్పు వివాదస్పదంగా మారింది. విగ్రహ ప్రతిష్ఠను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జూలూరు గౌరీశంకర్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా విగ్రహ రూపాన్ని యథాతథంగా ఉంచాలని పిటిషన్‌లో ఆయన విజ్ఞప్తి చేశారు. గౌరీశంకర్ పేర్కొన్న విషయాల ప్రకారం, తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉంది. దీని రూపం మార్పు ప్రజల ఆత్మగౌరవానికి దెబ్బతీయడం మాత్రమే కాకుండా, భావోద్వేగాలకు కూడా చెడు ప్రభావం చూపుతుందని పిటిషన్‌లో వివరించారు. ప్రస్తుతం ఈ పిల్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
త్వరలో విచారణ హైకోర్టు
ఈ వ్యవహారంపై హైకోర్టు త్వరలో విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, సచివాలయం ప్రాంగణంలో ఇటీవల నూతనంగా నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. అయితే, విగ్రహ రూపం మార్పు వివాదం వేళ, ఆవిష్కరణకు సంబంధించిన తేదీపై మరింత స్పష్టత రానుంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపం పట్ల ప్రజల్లోని అభిప్రాయాలను సేకరించి, ఆ ప్రకారమే ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టాలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ఈ వివాదం రాష్ట్రంలోని ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కావడంతో, దీని పరిష్కారం త్వరగా ఉండాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.