Telangana: పరిశ్రమల హబ్.. దండుమల్కాపురం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం రెవెన్యూ పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వం,తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) సంయుక్తంగా నిర్మించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) పార్కు తన లక్ష్యాన్ని చేరుకుంటోంది. ఈ పార్కు 2019 నవంబరు 1న ప్రారంభమైంది. 542 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న ఈ పార్కులో మొత్తం 510 పరిశ్రమలు విడతల వారీగా నెలకొల్పుతున్నారు. మొదటి విడతలో, తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC) 377 ఎకరాల భూమిని సేకరించి, పరిశ్రమల సమాఖ్యకు (TIF) అప్పగించింది. ఈ భూమిలో 350 పరిశ్రమలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
ఉత్పత్తిని ప్రారంభించిన 110 పరిశ్రమలు
ప్రస్తుతం, దాదాపు 110 పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. 130 పరిశ్రమలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. కొన్ని పరిశ్రమలు మరికొద్ది నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతాయి. కొన్ని యంత్రాల బిగింపు తుదిదశకు చేరుకున్నాయి. మరో 10 మంది పారిశ్రామిక వేత్తలు స్థలాలను పొందినా, ఇంకా నిర్మాణాలను ప్రారంభించలేదు. టిఫ్ ప్రతినిధులు వారికి నోటీసులు జారీ చేసి, నిర్మాణం ప్రారంభించకపోతే స్థలాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ పార్కులో ఇప్పటికే ఉన్న పరిశ్రమలు సుమారు ఐదు వేల మందికి ఉపాధిని అందిస్తున్నాయి. ఈ పరిశ్రమల్లో ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ప్రింటింగ్, ప్యాకింగ్, ఫార్ములేషన్, టైల్స్, వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసే బ్రికెట్స్ వంటి కాలుష్యరహిత పరిశ్రమలు ఉన్నాయి.
రాజధానికి సమీపంలో నిర్మించిన తొలి MSME పార్కు
దేశంలోనే రాజధానికి సమీపంలో నిర్మించిన తొలి MSME పార్కుగా, ఇది పారిశ్రామికవేత్తల నుండి భారీ స్పందన పొందింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో ఉండటం, ఔటర్ రింగు రోడ్డుకు దగ్గరగా ఉండటంతో, స్థలాల కోసం అధికంగా విన్నపాలు వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వం, మరో 165 ఎకరాల భూమిని సేకరించి, 160 మంది పారిశ్రామికవేత్తలకు పంపిణీ చేసింది. ఈ పరిశ్రమలు పూర్తయిన తర్వాత, సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులు సమకూరతాయి. అలాగే, 30,000 మందికి ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.