LOADING...
#NewsBytesExplainer: ఫోన్‌ ట్యాపింగ్ చుట్టూ రాజకీయం.. సీఎం వ్యాఖ్యలపై బీఆరెస్‌ మీడియా కౌంటర్
ఫోన్‌ ట్యాపింగ్ చుట్టూ రాజకీయం.. సీఎం వ్యాఖ్యలపై బీఆరెస్‌ మీడియా కౌంటర్

#NewsBytesExplainer: ఫోన్‌ ట్యాపింగ్ చుట్టూ రాజకీయం.. సీఎం వ్యాఖ్యలపై బీఆరెస్‌ మీడియా కౌంటర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల టెలిఫోన్ ట్యాపింగ్ అంశం చర్చకు కేంద్ర బిందువైంది. అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ మాటల యుద్ధానికి దిగాయి. గత బీఆర్ఎస్ పాలనలో అనేక ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ విచారణలు కొనసాగిస్తోంది. ఇదే సమయంలో,ప్రస్తుత మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు కొత్త ఆరోపణలు చెబుతున్నారు. ట్యాపింగ్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే తప్పేంటి? అదే ట్యాపింగ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే తప్పా? అనే వాదనలతో బీఆర్ఎస్ అనుకూల మీడియా వితండ వాదనలకు దిగినట్టు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు వివరణగా, బీఆర్ఎస్ అనుకూల పత్రికలు వార్తలను వక్రీకరిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి.

ట్యాపింగ్ 

చట్టపరంగా ట్యాపింగ్.. రేవంత్ రెడ్డి వివరణ.. 

దిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట విరుద్ధం కాదని స్పష్టం చేశారు. అయితే ఇది ఒక నిర్దిష్ట పద్ధతిలో,నిబంధనల ప్రకారం జరిగే చర్య అని పేర్కొన్నారు. మావోయిస్టులు, సంఘవిద్రోహ శక్తులు వంటి సమాజానికి హాని కలిగించే గుంపులపై అనుమానం ఉంటే, వారి ఫోన్లను ఇంటెలిజెన్స్ విభాగం ట్యాప్ చేస్తుందన్నారు. కానీ కొన్ని పత్రికలు ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకొని, రేవంత్ రెడ్డి ట్యాపింగ్ సమర్థిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ నాయకులు తాము అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అక్రమ ట్యాపింగ్‌పై వచ్చిన విమర్శలను తప్పించుకునేందుకు, ఇప్పుడు జరుగుతున్న చట్టపరమైన చర్యలతో పోల్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది.

బీఆర్ఎస్

బీఆర్ఎస్ హయాంలో ట్యాపింగ్‌ 

విశ్లేషకుల ప్రకారం, చట్టపరమైన ట్యాపింగ్‌కు సంబంధించి ఏ ఫోన్ నంబర్‌ను ట్యాప్ చేయాలో, ఆ వ్యక్తి వివరాలు కేంద్రానికి పంపించాల్సిన నిబంధన ఉంది. కానీ బీఆర్ఎస్ హయాంలో ఈ నియమాలను ఉల్లంఘిస్తూ, కేవలం నంబర్లు మాత్రమే పంపించి, అవి మావోయిస్టులవని పేర్కొని, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చట్టబద్ధంగా జరిగే ప్రక్రియను, అక్రమంగా జరిగిన చర్యలతో పోల్చడం అనర్థకమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ట్యాప్ 

మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారా? 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ అవుతోందని అన్నారు. పెగాసస్ వంటి ప్రైవేట్ సాఫ్ట్‌వేర్‌ను అధికారుల ద్వారా కాకుండా, బాహ్య వ్యక్తుల ద్వారా నడిపిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల కదలికలపై నిఘా పెట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండిస్తూ, తమ పాలనపై అసూయతో బీఆర్ఎస్ అబద్ధ ప్రచారం చేస్తోందని, ట్యాపింగ్ అవసరం తమ ప్రభుత్వానికి లేదని పేర్కొంది.

సీబీఐ 

సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ 

ఫోన్ ట్యాపింగ్ వివాదాన్ని సీబీఐకి అప్పగించాలని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేశారని బీజేపీ ఆరోపించింది. సిట్ బండి సంజయ్‌తో పాటు ఆయన సిబ్బందిని విచారించనుంది. జూలై 24న సిట్ ముందు హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా ముందుగా పిలిచిన తేదీకి హాజరుకాలేకపోయారని తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హోదాలో బండి సంజయ్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన కీలక సమాచారం కేంద్ర సంస్థల ద్వారా సేకరిస్తున్నారని ప్రచారం సాగుతోంది. సీబీఐ విచారణ జరిగితే అసలు నేరస్థులు ఎవరో బయటపడతారని బీజేపీ నమ్ముతోంది. సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున, దానిపై విశ్వాసం లేదని బీజేపీ అభిప్రాయం.

కాంగ్రెస్

సీబీఐకి అప్పగించకపోవడంపై కాంగ్రెస్ అనుమానం 

కాగా,ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి ప్రభుత్వం నిరాకరిస్తుండటాన్ని కాంగ్రెస్ అనుమానంతో చూస్తోంది. కేసును సీబీఐకి అప్పగిస్తే బీజేపీ బీఆర్ఎస్‌ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు చేసిన కిషన్ రెడ్డి అప్పట్లో సీబీఐ విచారణ కోరకపోవడంపై కూడా కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

ప్రభాకర్ రావు 

సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ 

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, సిట్ విచారణలో తనను వేధిస్తున్నారంటూ జూలై 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గంటల తరబడి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్ ఆగస్టు 4న విచారణకు రానుంది. ఇదే సమయంలో సిట్ కూడా ప్రభాకర్ రావుకు ఉన్న మినహాయింపులను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో వేరొక పిటిషన్ దాఖలు చేసింది. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని సిట్ వాదిస్తోంది.