Telangana: పెద్ద అంబర్‌పేటలో పోలీసులు కాల్పులు.. ఎందుకంటే ?
జాతీయ రహదారిపై పార్క్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న కరుడుగట్టిన పార్థీ ముఠా(Parthi gang)ను తెలంగాణ పోలీసులు విజయవంతంగా పట్టుకున్నారు. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేటలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ అరెస్ట్ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఈ ముఠాను గుర్తించి పెద్దంబర్‌పేట సమీపంలోని ఓఆర్‌ఆర్‌లో వెంబడించారు. ముఠా అరెస్టును ప్రతిఘటించి, కత్తులు చూపడంతో, చివరకు వారిని దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
ముఠా సభ్యుల అరెస్ట్ తో ఊపిరి పీల్చుకున్న నివాసితులు, ప్రయాణికులు
ముఠా సభ్యులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారని, తదుపరి విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాదకరమైన నేరస్థులు అరెస్ట్ అవ్వడంతో ఆ ప్రాంతంలోని నివాసితులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఠా కార్యకలాపాలపై నిఘా పెట్టిన నల్గొండ పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో అరెస్ట్ సాధ్యమైంది. జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాచకొండ కమిషనరేట్ పోలీసులతో కలిసి దొంగల ఆచూకీ కోసం గాలించారు.