Page Loader
TELANGANA CASH SEIZURE : కేవలం నాలుగు రోజుల్లోనే రూ.37.07 కోట్లు సీజ్
TELANGANA CASH SEIZURE : కేవలం నాలుగు రోజుల్లోనే రూ.37.07 కోట్లు సీజ్

TELANGANA CASH SEIZURE : కేవలం నాలుగు రోజుల్లోనే రూ.37.07 కోట్లు సీజ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 13, 2023
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలై నాలుగు రోజులైనా పూర్తి కాలేదు. కానీ దాదాపు 40 కోట్ల విలువైన సొత్తును పోలీసులు సీజ్ చేశారు. గురువారం వరకు రూ.20.43 కోట్ల నగదు, రూ.14.66 కోట్ల విలువైన బంగారం, వెండిని అధికారులు గుర్తించారు. రూ.89 లక్షల విలువ గల మాదకద్రవ్యాలు, రూ.87 లక్షల మద్యం నిల్వలు, పంపిణీకి సిద్ధం చేసిన రూ.22.51 లక్షల వస్తు సామగ్రిలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.37.07 కోట్లుగా ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం తెలిపింది. 2018 ఎన్నికల వేళ తనిఖీల్లో మొత్తం రూ.98 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

details

ఈసారి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలు, నేతలు

కానీ ఈసారి మొదటి 4 రోజుల్లోనే మూడోవంతు సొత్తును పట్టుకోవడం కొసమెరుపు. ఈ మేరకు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ మద్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే డబ్బు పంపిణీని అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అంతర్‌ రాష్ట్ర సరిహద్దుల్లో 89, రాష్ట్రంలోని 169 ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీఈఓ కార్యాలయం వెల్లడించింది. ఎలక్షన్ కోడ్ అమల్లో భాగంగా 75,226 నిర్మాణాలపై ప్రభుత్వ ప్రచార ఫ్లెక్సీలు, హోర్డీంగ్‌ తదితరాలను తొలగించామని తెలిపింది.

DETAILS

రాష్ట్రానికి 8 వేల మంది సాయుధ బలగాల కేటాయింపు 

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,476 తనిఖీ బృందాలు పనిచేస్తుండగా, ఇందులో 373 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 374 పలు ప్రాంతాల్లో నిమగ్నమైన బృందాలు, 729 ఎమర్జెన్సీ ఫోర్సెస్ పనిచేస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇప్పటికే 1,196 మందిపై ముందు జాగ్రత్తగా కేసులు నమోదు చేశామని చెప్పుకొచ్చింది. మరోవైపు ఎన్నికల బందోబస్తు కోసం వంద కంపెనీల కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను (CAPF-CENTRAL ARMED POLICE FORCE)ను ఎన్నికల సంఘం కేటాయించింది. ఒక్కో కంపెనీలో 80 సాయుధ పోలీసులు ఉంటారని, ఈ లెక్కన రాష్ట్రానికి 8 వేల మందిని కేటాయించామన్నారు. ఈ నెల 20 నాటికి ఆయా బలగాలన్నీ తెలంగాణలోకి అడుగుపెడతాయని స్పష్టం చేసింది.