Telangana: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్
ఈ వార్తాకథనం ఏంటి
2024-25 బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
2009-14 మధ్యకాలంలో యూపీయే ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఏటా సగటున కేటాయించిన రూ.886 కోట్లతో పోలిస్తే ఇది 6 రెట్లు ఎక్కువ అని ఆయన వివరించారు.
రైల్వే అభివృద్ధి గణాంకాలు
సోమవారం, ఢిల్లీలోని రైల్వే శాఖ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, 2014 తర్వాత తెలంగాణలో మొత్తం 753 కి.మీ. కొత్త రైల్వే ట్రాక్‌ను నిర్మించామని, ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మొత్తం రైల్వే నెట్‌వర్క్‌తో సమానమని తెలిపారు.
అదనంగా, రాష్ట్రంలో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని పేర్కొన్నారు.
వివరాలు
వందేభారత్ రైళ్లు & రైల్వే స్టేషన్ అభివృద్ధి
ఇప్పటి వరకు 453 ఫ్లైఓవర్లు, అండర్‌బ్రిడ్జిలు నిర్మించగా, 62 లిఫ్ట్‌లు, 17 ఎస్కలేటర్లు, 48 స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు.
రూ.39,300 కోట్లతో 2,529 కి.మీ. పొడవైన 22 కొత్త ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి. అదనంగా, రూ.1,992 కోట్లతో 40 అమృత్ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు.
ప్రస్తుతం 7 జిల్లాల మీదుగా 5 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అలాగే, రూ.715 కోట్లతో సికింద్రాబాద్, రూ.327 కోట్లతో హైదరాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి.
వివరాలు
నూతన ప్రాజెక్టుల ఆమోద విధానం
ఒక ప్రశ్నకు సమాధానంగా, గత యూపీయే ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులను బడ్జెట్‌లో చేర్చి కేవలం నామమాత్రంగా కేటాయింపులు చేసిందని, దానివల్ల అసలు అభివృద్ధి జరగలేదని మంత్రి అన్నారు.
కానీ,ప్రస్తుత ప్రభుత్వం ముందుగా సర్వే చేసి, ఆ ప్రాజెక్ట్‌కు వ్యాపారసాద్యత (ఫీజిబిలిటీ) ఉందని నిర్ధారించిన తర్వాతే డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)సిద్ధం చేస్తుందని తెలిపారు.
ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా,ప్రాజెక్టును ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్,వాణిజ్య శాఖల పరిశీలనకు పంపిన తర్వాత కేబినెట్ ఆమోదం కోసం ఉంచుతామని వివరించారు.
గత జూలై నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రూ.40,000 కోట్ల కొత్త ప్రాజెక్టులను ఆమోదించామని తెలిపారు.
ఇకపై ప్రతి ఏడాది బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులను ప్రకటించకుండా,సంవత్సరం పొడవునా వాటిని ఆమోదించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
భద్రత & ట్రాక్ మెయింటెనెన్స్
ట్రాక్‌ల నిర్వహణ (మెయింటెనెన్స్) కోసం కొన్ని రైల్‌స్టాప్‌లను మార్చినట్లు మంత్రి వెల్లడించారు.
ట్రాక్ కనీసం 3 గంటలు ఖాళీగా ఉంటేనే మెయింటెనెన్స్ చేయడం సాధ్యమవుతుందని, రైళ్ల భద్రత కోసం ఇది ఎంతో కీలకమని వివరించారు.
కవచ్ భద్రతా వ్యవస్థ
తెలంగాణలో 1,326 కి.మీ. మార్గంలో కవచ్ భద్రతా వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 1,011 కి.మీ. మేర పనులు పూర్తయినట్లు వివరించారు. 2024 నుంచి వచ్చే ఆరేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే నెట్‌వర్క్‌కు కవచ్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
కాజీపేట రైల్వే
యూనిట్ కాజీపేట రైల్వే యూనిట్‌ను మల్టిపుల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే అక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు.