Pawan Kalyan: నేటి నుంచి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ వివరాలు ఇవీ..
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ-జనసేన అభ్యర్థుల గెలుపుకోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం, గురువారాల్లో జరగనున్న పవన్ కళ్యాణ్ బహిరంగ సభల వివరాలను జనసేన విడుదల చేసింది. బుధవారం వరంగల్ లో బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్న విజయసంకల్ప సభలో పవన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ సభ ప్రారంభం కానుంది. అలాగే గురువారం మూడు నియోజకవర్గాల్లో పవన్ పర్యటన కొనసాగనుంది. ఉదయం 11గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 2గంటలకు సూర్యాపేట, సాయంత్రం 4.30గంటలకు దుబ్బాకలో జరిగే సభల్లో పవన్ ప్రసంగించనున్నారు.
తెలంగాణలో 8స్థానాల్లో జనసేన పోటీ
ఇదిలా ఉంటే, ఈనెల 25న తాండూరులో పవన్ పర్యటించనున్నారు. జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ గెలుపుకోసం ఆయన ప్రచారం చేయనున్నారు. 26న కూకట్ పల్లిలో జనసేన తరఫున పోటీ చేస్తున్న ప్రేమ కుమార్‌కు మద్దతుగా పవన్ ప్రచారంలో పాల్గొంటారు. పవన్ పాల్గొనే ఇతర కార్యక్రమాల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని జనసేన తెలిపింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాబోయే మూడు, నాలుగు రోజలు ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కేంద్ర నాయకులు తెలంగాణ వస్తున్నారు. ఈ క్రమంలో వారితో కలిసి ప్రచారంలో పాల్గొనేలా పవన్ ఒప్పించేందుకు తెలంగాణ బీజేపీ ప్రయత్నిస్తోంది.