తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల పనివేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో విద్యార్థుల బడి వేళల్లో విద్యాశాఖ కీలక మార్పులను నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీఎస్ఈలకు ఉత్తర్వులు జారీ చేసింది.
నూతన వేళల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పనిచేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నాయి.
మరోవైపు ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు యథావిధిగా కొనసాగనున్నట్లు వివరించింది. ఉన్నత పాఠశాలల సమయ వేళల్లో ఎటువంటి మార్పులు చేయలేదని తెలిపింది.
బడి వేళల మార్పుపై గత కొద్దికాలంగా పాఠశాల విద్యాశాఖకు అనేక ఫిర్యాదులు, సలహాలు, సూచనలు వెల్లువెత్తాయి.
DETAILS
ఇకపై ప్రాథమిక, ఉన్నత విద్యార్థులకు ఉదయం 9.30కే తరగతులు ప్రారంభం
ప్రాథమిక పాఠశాలల్లో చదివేది చిన్నారులు కాబట్టి ఉదయం త్వరగా నిద్రలేవలేరనే నేపథ్యంలో కీలక విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వివరించింది. మారిన బడి వేళల నేపథ్యంలో ఉదయం 9.30గంటలకు తరగతులు మొదలవుతాయి.
ఉన్నత పాఠశాలల్లో కాస్త ఎదిగిన పిల్లలు ఉంటారు కనుక ఉదయం 9గంటలకే పాఠశాలలు మొదలు కావాల్సి ఉంది. కానీ 9.30 గంటలకు తరగతులు ప్రారంభమవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్నత పాఠశాలల బడి వేళలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విద్యాశాఖ దృష్టికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఉన్నత పాఠశాలల మాదిరే ప్రాథమిక పాఠశాలల వేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజా ఉత్తర్వులు సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తాయని ఉత్తర్వులో విద్యాశాఖ స్పష్టం చేసింది.