హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు
హైదరాబాద్ మహానగరంలోని మలక్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో పెను రైలు ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్ మీదకు ఒకేసారి రెండు లోకల్ ట్రైన్లు ఎదురెదురుగా వచ్చాయి. గమనించిన లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ మేరకు రైళ్లను కొద్ది దూరంలో నిలిపివేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్టైంది. సమాచారం అందుకున్న దక్షిణ మధ్య రైల్వే అధికారుల బృందం హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుంది. దాదాపు అరగంట సేపు రైళ్లను అలాగే ట్రాక్‌పై నిలిపేయడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం పరిస్థితిని సమీక్షించిన అధికారులు, సదరు రైళ్లకు రూట్ క్లియర్ చేసి వైర్వేరుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే లైన్‌లోకి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు
ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే లైన్‌లోకి ఎలా వచ్చాయని కోణంలో ఇప్పటికే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.సమన్వయ లోపం ఎక్కడ జరిగింది అనే నేపథ్యంలో ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నగర వాసులకు అత్యంత వేగంగా, తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేర్చే ప్రజా రవాణా వ్యవస్థల్లో రైల్వేది కీలక పాత్ర. ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల నుంచి పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల వరకు చాలా మంది ఎంఎంటీసీ (MMTS) రైళ్ల మీదే ఆధారపడతారు. అలాంటి రైళ్లు ప్రమాదం అంచున నిలబడ్డాయంటే ఆయా ప్రయాణికుల్లో ఒక్కసారిగా గుబులు రేగింది. ప్రమాదం జరగకుండా లోక్ పైలెట్ల అప్రమత్తతతో అంతా సరక్షితంగా బయటపడగలిగారు.