తెలంగాణ బీజేపీకి గుడ్ న్యూస్.. మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ బీజేపీకి మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద పార్టీ తలబెట్టిన ధర్నాకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు ఇటీవలే పార్టీ పిలుపునిచ్చింది. అయితే పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ధర్నా చేసేందుకు తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. అయితే దీనికి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల 14నే ధర్నా కోసం బీజేపీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ధర్నాకి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదని పోలీసులను ప్రశ్నించింది.
వెయ్యి మందిని కూడా పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఎలా : హైకోర్టు
ధర్నా పేరుతో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించే ప్రమాదం ఉందని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.వేరేవాళ్లకు అనుమతులు ఇచ్చి, బీజేపీకి ఎందుకు అనుమతివ్వట్లేదని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే దాదాపు 1000 మందికిపైనే ధర్నాకు హాజరయ్యే అవకాశం ఉందని, అందుకే పర్మిషన్ ఇవ్వలేదన్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ న్యాయవాది వాదనలతో విభేదించిన హైకోర్టు, వెయ్యి మందిని కూడా పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేసింది. కేంద్రానికి వ్యతిరేకంగా చేసే ధర్నాల వల్ల శాంతి భద్రతలకు ఇబ్బందులు తలెత్తడం లేదా అని నిలదీసింది. ఈనెల 20న బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న కిషన్ రెడ్డిని అడ్డుకున్నట్లు బీజేపీ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం.