Telangana student: పుట్టినరోజు నాడు పేలిన సొంత తుపాకీ.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి
అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి పాల్వాయి ఆర్యన్‌రెడ్డి (23) తన సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో ప్రాణాలు కోల్పోయారు. జార్జియాలోని అట్లాంటా ప్రాంతంలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్యన్ ఈ నెల 13న జరిగిన ఈ దుర్ఘటనలో మరణించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తుపాకీ బుల్లెట్ ఛాతీకి తగలడంతో..
హైదరాబాద్‌లోని ఉప్పల్ ధర్మపురి కాలనీలో నివసించే పాల్వాయి సుదర్శన్‌రెడ్డి, గీత దంపతుల ఏకైక కుమారుడైన ఆర్యన్, ఉన్నత చదువుల కోసం గత ఏడాది డిసెంబర్‌లో అమెరికా వెళ్లారు. ఈ నెల 13న తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ జరుపుకుంటున్న సమయంలో, ఆయన గది నుంచి తుపాకీ శబ్దం వినిపించింది. స్నేహితులు గదిలోకి చేరేలోపే, తుపాకీ బుల్లెట్ ఛాతీకి తగలడంతో ఆర్యన్ అక్కడికక్కడే మరణించారు. తుపాకీని శుభ్రం చేసే సమయంలో ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ కావడంతో ఈ ఘటన జరిగి ఉండవచ్చని ఆయన తండ్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
గన్ కల్చర్‌పై తండ్రి ఆవేదన
ఆర్యన్ దేశసేవ పట్ల ఆసక్తి చూపేవాడని, ఆర్మీలో చేరాలనుకున్నప్పటికీ తామే వారించామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. కానీ, అమెరికాలో గన్ కల్చర్ కారణంగా తమ కుమారుడిని కోల్పోవాల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ విద్యార్థులకు కూడా గన్ లైసెన్సులు ఇస్తారన్న విషయం ఇప్పుడే తెలుసుకున్నామన్నారు. ఆర్యన్ ఈ ఏడాది ఆగస్టులో హంటింగ్ గన్‌కు లైసెన్సు పొందేందుకు పరీక్ష రాసి, లైసెన్సు పొందినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అకాలంగా ఓ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం అందరిని కలచివేస్తోంది.