Telangana TDP: టీడీపీ కీలక నిర్ణయం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ ఆదివారం నిర్ణయించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కష్టాల్లో ఉన్న పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారు. అందుకే పోటీకి దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించుకుంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం కలిశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టలేమని జ్ఞానేశ్వర్‌తో చంద్రబాబు చెప్పారు.
ఎందుకు పోటీ చేయడం లేదో నాయకులకు చెప్పండి: జ్ఞానేశ్వర్‌తో చంద్రబాబు
తెలంగాణలో టీడీపీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తోందో.. క్షేత్ర స్థాయి నాయకులకు వివరించాలని జ్ఞానేశ్వర్ కు చంద్రబాబు వివరించారు. సెప్టెంబరు 9న స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. చంద్రబాబు కుటుంబంతో పాటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ మొత్తం ప్రస్తుతం వివిధ కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణలో పార్టీపై దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొంది.
తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా టీడీపీ
వాస్తవానికి టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు ఎన్.బాలకృష్ణ ఇటీవల హైదరాబాద్‌లో టీడీపీ నేతలతో సమావేశమై ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని బాలకృష్ణ ప్రకటించారు. కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని, పార్టీ పూర్వ వైభవం తెస్తామని గతేడాది డిసెంబర్‌లో ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ లోపు ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆవిర్భావం తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ రెండు సీట్లను గెల్చుకొంది.