
New Excise Police Stations: హైదరాబాద్‌లో 13 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు.. వరంగల్ అర్బన్‌లో ఒకటి
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతి లభించింది.ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో 14కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి.
వీటిలో హైదరాబాద్‌లో 13, వరంగల్ అర్బన్‌లో ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
2020లోనే ఈ 14ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేపట్టగా,ప్రస్తుతం విభజన, ప్రాంతాల నిర్ణయం,బదిలీ ప్రక్రియ పూర్తయింది.
ఈ కొత్త స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో,ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,ప్రిన్సిపల్ సెక్రటరీ రిస్వి,కమిషనర్ చెవ్వూరు హరి కిరణ్ తుది ఆమోదం తెలిపారు.
ఏప్రిల్ 1వ తేదీ నుంచే కొత్త స్టేషన్లు విధులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అడిషనల్ కమిషనర్ అజయ్‌రావు,సంబంధిత డిప్యూటీ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాలు
కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల కోసం అద్దె భవనాలు
కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల కోసం అద్దె భవనాలను గుర్తించాలని కమిషనర్ ఆదేశించారు.
ప్రస్తుతం బంజారా హిల్స్, చిక్కడ్‌పల్లి, గండిపేట్, కొండపూర్, పెద్ద అంబర్‌పేట్, కూకట్‌పల్లి, అమీన్‌పూర్, హసన్‌పర్తి స్టేషన్లకు అద్దె భవనాల గుర్తింపు పూర్తయింది. అయితే, మారేడ్‌పల్లి, మీర్‌పేట్, కొంపల్లి, కాప్రా, నాచారం, అల్వాల్ ప్రాంతాల్లో అద్దె భవనాలు అందుబాటులో లేకపోవడంతో, ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక గదుల్లోనే వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.