Page Loader
Gangula Kamalakar : 'ఎన్నికలపై గంగుల సంచలన వ్యాఖ్యలు.. మనకు ఆంధ్రోళ్లకే ఈ ఎన్నికలు'
'మనకు ఆంధ్రోళ్లకే ఈ ఎన్నికలు'

Gangula Kamalakar : 'ఎన్నికలపై గంగుల సంచలన వ్యాఖ్యలు.. మనకు ఆంధ్రోళ్లకే ఈ ఎన్నికలు'

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 14, 2023
06:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఎన్నికలు మరో కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికలు ఆంధ్రావాళ్లకు, మనకు జరిగే యుద్ధమన్నారు. మంగళవారం కొత్తపల్లి మండలం మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రావాళ్లు, దిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపణలు గుప్పించారు. అందువల్లే ఈసారి ఎన్నికలు తెలంగాణ వాళ్లకు, ఆంధ్రా వాళ్లకు అని ప్రచారం చేసిన గంగుల, తాను చేసిన అభివృద్ధి పనులు చూసి మరోసారి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

details

బండి సంజయ్ ఏం చేశాడు : గంగుల

కరీంనగర్ ఎంపీగా బీజేపీ నేత బండి సంజయ్‌ను గెలిపిస్తే ప్రజలకు ఏం చేయలేదన్నారు. ఒక్క రోజు కూడా గ్రామాల్లో జనం ముఖం చూడని వ్యక్తిని ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేయలేడన్నారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నేతలకు ఓట్లు వేస్తే, పవిత్రమైన ఓటు వృథా అలుతుందన్నారు. ఎంతో కష్టపడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ చేతుల్లో ఉంటూనే సుభిక్షంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఇతర పార్టీల చేతిలో మోసపోతే జనం ఇబ్బంది పడక తప్పదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మోసగాళ్లని, వారి పట్ల తస్మాత్ జాగ్రత్త అని గంగుల అంటున్నారు.