Transportation System: ఓఆర్‌ఆర్‌కు 2 గంటల్లోనే చేరేలా.. విజన్-2047లో అధునాతన రవాణా వ్యవస్థ
ఈ వార్తాకథనం ఏంటి
ఆసుపత్రులకు వెళ్లే రోగులైనా,కాలేజీల బాట పట్టే విద్యార్థులైనా,పంటలను మార్కెట్‌కు తరలించే రైతులైనా... తెలంగాణలోని ప్రజల్లో దాదాపు 90 శాతం మంది రాష్ట్రం ఎక్కడ ఉన్నా రెండు గంటల్లోనే హైదరాబాద్ బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్) చేరుకునేలా 'విజన్-2047' ప్రణాళిక ముసాయిదా సిద్ధమవుతోంది. ప్రపంచంతో అనుసంధానమై ఉన్న హైదరాబాద్‌ను కేంద్రంగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో రవాణా అనుసంధానాన్ని మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపుదిద్దుకుంది. 2,053 చ.కిమీ విస్తీర్ణంలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్),9,281 చ.కిమీ మేర వ్యాపించి ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్),అలాగే 1,00,743 చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్)లను సమర్థవంతమైన రోడ్డు,రైలు మార్గాలతో అనుసంధానం చేయడమే ఈ విజన్ ప్రధాన ఉద్దేశం.
వివరాలు
ప్రజారవాణాకు కామన్ మొబిలిటీ కార్డు:
క్యూర్ పరిధిలో ప్రజారవాణాను మరింత సులభంగా మార్చేందుకు విస్తృత ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న ఎంఎంటీఎస్‌కు తోడు 623కి.మీ.కి పైగా పొడవున మెట్‌రో,లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎల్‌ఆర్‌టీఎస్) విస్తరణ,పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులతో నడిచే 100 శాతం ఆర్టీసీ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్‌టీఎస్),అలాగే సుమారు 1,000 కి.మీ.మేర వాక్‌వేలు,సైక్లింగ్ మార్గాలతో కూడిన సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించనున్నారు. ఈ వ్యవస్థల ద్వారా మొత్తంగా 70 శాతం ప్రజారవాణా జరిగేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు, అర్బన్ ఎయిర్ మొబిలిటీ (యూఏఎం), ఈవోటీఓఎల్ విమానాలు, పాడ్ ట్యాక్సీల ఏర్పాటు కూడా ప్రణాళికలో భాగమే. ఇవన్నీ ఒకే కామన్ మొబిలిటీ కార్డు లేదా డిజిటల్ ఖాతా ద్వారా వినియోగించుకునేలా ప్రత్యేక ప్లాట్‌ఫాం రూపొందించనున్నారు.
వివరాలు
నగర నవీకరణ పనులు:
వ్యర్థాలతో నిండినప్రాంతాలను అభివృద్ధి చేసేలా బ్రౌన్‌ఫీల్డ్ రీడెవలప్‌మెంట్ చేపట్టనున్నారు. మురికివాడలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు 'ఇన్‌సిటు స్లమ్ ఏరియా డెవలప్‌మెంట్' కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పురాతన, చారిత్రక కట్టడాలకు యునెస్కో గుర్తింపు సాధించేందుకు చర్యలు తీసుకోనున్నారు. పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అర్బన్ రెట్రోఫిట్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు. బ్లూ-గ్రీన్ హైదరాబాద్: మూసీ నది ఒడ్డున రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు, వందకు పైగా చెరువులు, జలాశయాలను పునరుద్ధరించనున్నారు. నగరమంతా హరిత వీధులతో కూడిన గ్రీన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
తాగునీరు - మురుగునీటి సమీకృత వ్యవస్థ:
158 కి.మీ. మేర విస్తరించి ఉన్న ఓఆర్‌ఆర్ చుట్టూ రింగ్ మెయిన్ ఏర్పాటు చేసి 24 గంటల పాటు నిరంతర తాగునీటి సరఫరా అందించేలా చర్యలు చేపట్టనున్నారు. మహానగర పరిధిలో పూర్తిస్థాయిలో మురుగునీటి వ్యవస్థను అమలు చేయనున్నారు. స్పేషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారం: వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక క్లైమేట్ రెసిలియెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ డ్యాష్‌బోర్డులు, సమాచార కియోస్కులు, ఐవోటీ సెన్సర్ నెట్‌వర్క్‌తో పాటు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు.
వివరాలు
ప్రపంచ స్థాయి ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా 13 ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణం చేపట్టనున్నారు. ఆధునాతన తయారీ క్లస్టర్లు, నెట్-జీరో లక్ష్యాలతో గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించే ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు అవకాశాలు కల్పించడంతో పాటు 5 పర్యాటక నోడ్లు, 5 లాజిస్టిక్స్ నోడ్లు, 11 బహుళార్ధ నోడ్లను అభివృద్ధి చేయనున్నారు. అలాగే 40 నుంచి 45లక్షల జనాభా నివాసానికి అనువుగా 10గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లను నిర్మించనున్నారు. అధునాతన మెట్రోపాలిటన్ రవాణా వ్యవస్థ: 15కి పైగా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్స్‌తో కూడిన సమీకృత రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడీ) కారిడార్లు,24 కొత్త బస్, రైలు టర్మినళ్ల నిర్మాణం చేయనున్నారు. రేడియల్,రీజినల్ రింగ్ రోడ్లకు సమీపంలో ఆధునిక లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
టాలెంట్ హైపర్‌లూప్ - 2047:
మహిళలు, యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో 6 నుంచి 8 సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 100 నైపుణ్య కేంద్రాలను స్థాపించనున్నారు. గ్రీన్ మెట్రోపొలిస్‌గా మార్పు: 5 ప్రధాన రిజర్వాయర్లు, 304 చ.కిమీ విస్తీర్ణంలో విస్తరించిన 2,959 జలాశయాలు, 918 చ.కిమీ అటవీ విస్తీర్ణం, 400 కి.మీ. మేర పరీవాహక ప్రాంతాలు, జీవో-111 పరిధి, వ్యవసాయ మండలాలు, భారీ క్రీడా మౌలిక సదుపాయాలు, అడ్వెంచర్ స్పోర్ట్స్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. మెట్రోపాలిటన్ ప్రాంతంలోని 45 శాతం విస్తీర్ణాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసి దేశంలోనే అత్యంత హరిత, నీల వర్ణంతో మెరిసే మెట్రోపొలిస్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివరాలు
భవిష్యత్ నగరంగా ఎఫ్‌సీడీఏ:
హైదరాబాద్ శివార్లలో సుమారు 25 నుంచి 30 లక్షల జనాభాకు సరిపడేలా 765 చ.కిమీ విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఈ ఏడాదే ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేశారు. సుమారు 30 వేల ఎకరాల్లో 'వర్క్, లివ్, లెర్న్, ప్లే' భావనతో దేశంలోనే తొలిసారిగా నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ): 300 ఎకరాల్లో ఏఐసీటీ హబ్, 200 ఎకరాల్లో హెల్త్ సిటీ, 500 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్, 3,000 ఎకరాల్లో లైఫ్ సైన్సెస్ హబ్‌లతో కూడిన విశాలమైన సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్:
100 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, 18 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్, థీమ్ పార్కులు, రిసార్టులు, అలాగే 15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను ఆనుకొని ఉన్న రాజీవ్ జూలాజికల్ పార్కుతో పాటు విస్తృత స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్ రూపకల్పన చేపట్టనున్నారు.