Page Loader
తెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు
తెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు

తెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు

వ్రాసిన వారు Stalin
Apr 20, 2023
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల మరింత ఆసక్తి కలిగించేలా, వారికి సులభంగా అర్థమయ్యేలా తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చాక్ అండ్ బోర్డ్ లేదా స్మార్ట్ క్లాస్‌రూమ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనుభవం మాత్రమే కాకుండా విద్యార్థులకు 3డీ క్లాసులను అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులకు అర్థమయ్యే సులవైన పద్ధతుల్లో ఒకటైన వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఉదాహరణకు, జీవశాస్త్ర పాఠాలను నేర్చుకునేటప్పుడు గుండె, కణ నిర్మాణం విధులు వంటివి పాఠాలను ఇంటరాక్టివ్ టెక్నాలజీలను ఉపయోగించి 3D/5D మోడ్‌లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌ల ద్వారా బోధించడం వల్ల విద్యార్థులు అందులో మరింత లీనమయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ

పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా 5 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక

విద్యార్థుల్లో నేర్చుకునే జీజ్ఞాసను పెంపొందించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని తొలుత ప్రయోగాత్మకంగా 5 ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా, ప్రతి పాఠశాలలోని ల్యాబ్‌లో 20 వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌లు లేదా హెడ్‌గేర్‌లు, 20 బీన్ బ్యాగ్‌లు, ఒక్కో టాబ్లెట్, ఒక స్టోరేజ్ కేస్, 1 కేవీఏ యూపీఎస్ ఉంటాయి. ఈ ల్యాబ్‌లు సాంఘీక శాస్త్రం, గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాలను బోధించడానికి, నేర్చుకోవడానికి ఉపయోగపడుతాయి. ల్యాబ్‌ల ఏర్పాటుకోసం సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసేందుకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ సేవలను విద్యాశాఖ ఉపయోగించుకుంది.