Telangana: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల గాలులు: వాతావరణ కేంద్రం
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోల్చితే 2నుండి 4డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్,కుమురంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్,సంగారెడ్డి,మెదక్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో శీతల గాలులు వీచనున్నట్లు హెచ్చరించారు. ఇక ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని,ఇది సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో ఈఅల్పపీడనం మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.